దావోస్ వేదికగా జరిగే పారిశ్రామిక సదస్సుకు వెళ్లిన మంత్రి కేటీఆర్ ఒక వీడియోను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడానికి దావోస్ వెళ్లిన ఆయన పారిశ్రామికవేత్తలను ఆలోచింప చేసేలా వీడియోను విడుదల చేయడం గమనార్హం.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు ఆదివారం ప్రారంభం కానుంది. ప్రపంచ దిగ్గజ సంస్థల పెట్టుబడులను రాబట్టేందుకు ఆయా దేశాలు, రాష్ట్రాలు తమ ప్రతినిధి బృందాలను దావోస్ పంపించడం మామూలే. ఆ సదస్సుకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా ప్రభుత్వాల ప్రతినిధి బృందాలు దావోస్ చేరుకున్నాయి. ఏపీ ప్రతినిధి బృందంకు నేతృత్వం వహిస్తున్న సీఎం జగన్ కూడా దావోస్ చేరుకుంటున్నారు.
తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు. ఇప్పటికే లండన్ టూర్‌లో ఉన్న ఆయన అటు నుంచి అటే దావోస్ చేరుకున్నారు. సదస్సుకు హాజరు కానున్న తెలంగాణ ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. కేటీఆర్ దావోస్ సదస్సుకు సంబంధించిన టూర్‌పై ఆసక్తి రేకెత్తించే ఓ వీడియోను కూడా విడుదల చేసింది.