యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవ‌రీత‌ను?

50 ఏళ్ల టెర్నస్ 2001లో యాపిల్‌లో చేరారు. తెర వెనుక ఉంటూ కంపెనీ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ హెడ్‌గా మేక్‌బుక్ అమ్మకాల్లో కొత్త జవసత్వాలు నింపిన ఘనత టెర్నస్‌కు దక్కుతుంది.

Published By: HashtagU Telugu Desk
Apple CEO

Apple CEO

John Ternus: టెక్ దిగ్గజం యాపిల్ జాన్‌ టెర్నస్‌ను తన తదుపరి సీఈఓగా ప్రకటించింది. 15 ఏళ్ల పాటు సంస్థను నడిపించిన టిమ్ కుక్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. గత 25 ఏళ్లుగా యాపిల్‌లో పనిచేస్తున్న టెర్నస్ సెప్టెంబర్ 1 నుండి కంపెనీ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన యాపిల్‌లో హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా ఉన్నారు. మరోవైపు సీఈఓ పదవి నుండి తప్పుకున్న తర్వాత టిమ్ కుక్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతారు. అంటే యాపిల్‌తో కుక్ ప్రయాణం ఇంకా కొనసాగుతుందన్నమాట. 2011లో స్టీవ్ జాబ్స్ తర్వాత కుక్ యాపిల్ బాధ్యతలు స్వీకరించారు.

2001లో యాపిల్‌లో చేరిన టెర్నస్

50 ఏళ్ల టెర్నస్ 2001లో యాపిల్‌లో చేరారు. తెర వెనుక ఉంటూ కంపెనీ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ హెడ్‌గా మేక్‌బుక్ అమ్మకాల్లో కొత్త జవసత్వాలు నింపిన ఘనత టెర్నస్‌కు దక్కుతుంది. సరసమైన మోడళ్లతో పాటు ప్రీమియం ప్రో మోడళ్లను ఆయనే పరిచయం చేశారు. ఏఐ, సెమీకండక్టర్ టెక్నాలజీలో తీవ్రమైన పోటీ నెలకొన్న తరుణంలో ఆయన సీఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

Also Read: చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ మాస్టర్ ప్లాన్!

కుక్‌కు అత్యంత సన్నిహితుడు

టెర్నస్ టిమ్ కుక్‌కు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్థుడిగా పేరు పొందారు. టెర్నస్‌ను సీఈఓగా ప్రకటిస్తూ రాసిన లేఖలో కుక్ ఆయనను ఈ పదవికి పర్ఫెక్ట్ వ్యక్తిగా అభివర్ణించారు. టెర్నస్ ఒక అద్భుతమైన ఇంజనీర్, గొప్ప ఆలోచనాపరుడని, 25 ఏళ్లుగా యాపిల్ ఉత్పత్తుల తయారీలో భాగస్వామిగా ఉన్నారని కుక్ పేర్కొన్నారు. టెర్నస్ వయస్సు కూడా ఆయనకు కలిసి వచ్చింది. ప్రస్తుతం ఆయన వయస్సు 50 ఏళ్లు కాగా యాపిల్‌లోని ఇతర సీనియర్ అధికారులు చాలా మంది రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నారు. దీనివల్ల టెర్నస్ సుదీర్ఘ కాలం పాటు కంపెనీని నడిపించే అవకాశం ఉంది.

టిమ్ కుక్ హయాంలో యాపిల్ సాధించిన విజయాలు

టిమ్ కుక్ సీఈఓగా ఉన్న 15 ఏళ్ల కాలంలో యాపిల్ అసాధారణ వృద్ధిని సాధించింది. కంపెనీ విలువ 3.6 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. 2018లో 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను దాటిన అమెరికా తొలి కంపెనీగా యాపిల్ రికార్డు సృష్టించింది. తన లేఖలో కుక్ ఇలా పేర్కొన్నారు. నేను యాపిల్ వినియోగదారులకు వీడ్కోలు చెప్పడం లేదు. ఇది కేవలం మార్పు సమయం మాత్రమే. ప్రపంచంలోనే అత్యున్నతమైన కంపెనీకి సీఈఓగా పనిచేసే అవకాశం లభించినందుకు చాలా గర్వంగా ఉంది. ప్రజలు నాపై చూపిన ప్రేమ, నమ్మకానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను అని రాసుకొచ్చారు కుక్‌.

  Last Updated: 21 Apr 2026, 11:51 AM IST