Site icon HashtagU Telugu

Isro@Aug7: 750 మంది విద్యార్థినులు ఆవిష్కరించిన ఉపగ్రహం.. ఆగస్టు 7న ఎస్‌ఎస్‌ఎల్‌వీ ద్వారా నింగిలోకి

Sslv Imresizer

Sslv Imresizer

చిన్న తరహా ఉపగ్రహాల ప్రయోగాలకు భవిష్యత్ లో చాలా డిమాండ్ ఉంటుంది. ఎన్నో స్వదేశీ, విదేశీ సంస్థలు తాము అభివృద్ధి చేయించుకున్న చిన్నపాటి ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఆసక్తి చూపే ఛాన్స్ ఉంది.ఈ వ్యాపార అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఇస్రో సమాయత్తమైంది.

చిన్న తరహా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను ఇస్రో అభివృద్ధి చేసింది. దీన్ని ఈనెల 7వ తేదీ ఉదయం 9.18 గంటలకు తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనుంది. ఈ రాకెట్‌ ద్వారా 142 కిలోల భూ పరిశీలన ఉపగ్రహం మైక్రోశాట్‌-2ఎను కక్ష్యలోకి ప్రవేశపెడతారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 75 జిల్లా పరిషత్‌ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది గ్రామీణ బాలికలు రూపొందించిన 8 కిలోల ఆజాదీశాట్‌ను కూడా ఎస్‌ఎస్‌ఎల్‌వీ ద్వారా రోదసీలోకి ప్రయోగిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఈనెల 7న ప్రయోగాన్ని వీక్షించేందుకు సందర్శకులకు అనుమతి ఇస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఆసక్తి ఉన్నవారు ఎల్‌వీజీ.ఎస్‌హెచ్‌ఎఆర్‌.జీవోవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది.  ఈ ప్రయోగ వీక్షణకు వచ్చేవారు కొవిడ్‌ టీకా రెండు డోసులు వేసుకున్నట్లు ధృవీకరణపత్రం కానీ, లేదా కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ గానీ తప్పని సరిగా తీసుకురావాలని నిబంధన విధించింది.