Site icon HashtagU Telugu

Instagram : ఇన్‌స్టాగ్రామ్‌ పై ఐర్లాండ్‌ కొరడా.. రూ.3200 కోట్ల భారీ జరిమానా!!

Most Popular App

Instagram

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌ కు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థపై ఐర్లాండ్‌ కొరడా ఝుళిపించింది. ఇన్‌ స్టాగ్రామ్‌ పై ఏకంగా రూ.3200 కోట్ల భారీ జరిమానా విధించింది. ప్రధానంగా పిల్లల డేటా నిర్వహణలో అవకతవకలపై విచారణ జరిపిన తర్వాత ఐర్లాండ్‌ దేశ రెగ్యులేటరీ ఈమేరకు చర్యలు చేపట్టింది. గత శుక్రవారం రెగ్యులేటరీ ఈ నిర్ణయం తీసుకుందని ఐర్లాండ్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషనర్‌ ప్రతినిధి వెల్లడించారు. ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే వారంలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. అయితే, భారీ జరిమానా విధింపుపై ఇన్‌స్టాగ్రామ్‌ అప్పీల్‌ చేయాలని యోచిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ఏడాది క్రితం తన సెట్టింగ్స్‌ను అప్‌డేట్ చేసిందని, టీనేజర్లను సురక్షితంగా వారి సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచడానికి కొత్త ఫీచర్‌లను విడుదల చేసిందని మెటా ప్రతినిధి తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌ ప్రస్తుతం మెటా ఆధ్వర్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

యూజర్ల డేటా ట్రాక్ చేస్తోందా ?

ఫొటో/వీడియో షేరింగ్‌ కోసం ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను ఉపయోగిస్తుంటారు. ఐఓఎస్‌లో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను మెటా సంస్థ ట్రాక్ చేస్తున్నట్లు ఫెలిక్స్‌ క్రాస్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు ఇటీవల వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ లేదా ఫేస్‌బుక్‌ యాప్‌ నుంచి ఏదైనా యూఆర్‌ఎల్‌ లింక్‌ ఓపెన్‌ చేసినప్పుడు మెటా సంస్థ యూజర్‌ డేటాను ట్రాక్‌ చేస్తున్నట్లు గుర్తించామని ఫెలిక్స్‌ తన బ్లాగ్‌తో పేర్కొన్నారు. పాస్‌వర్డ్‌‌, క్రెడిట్‌ కార్డ్ వంటి వాటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సేకరిస్తున్నారని తెలిపారు.  ఐఓఎస్‌ యూజర్లలో ఎక్కువ మంది డీఫాల్ట్‌ బ్రౌజర్‌గా సఫారీని ఉపయోగిస్తుంటారు. ఏదైనా యూఆర్‌ఎల్‌ లింక్‌పై క్లిక్ చేస్తే అది సఫారీ బ్రౌజర్‌లో ఓపెన్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లు మాత్రం సఫారీ కాకుండా తమ సొంత బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు తెలిపాయి. ఇందులో మెటా పిక్సెల్‌ అనే కోడ్‌ సాయంతో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో యూజర్ల ప్రతి కదలికను మెటా సంస్థ ట్రాక్‌ చేస్తోందని ఆరోపిస్తున్నాయి.