Site icon HashtagU Telugu

Indian Railways: కదులుతున్న రైలు నుంచి మీ విలువైన వస్తువులు పడిపోయాయి.. అయితే వెంటనే ఇలా చేయండి?

Images

Images

మామూలుగా రైలులో నిత్యం లక్షలాదిమంది ప్రయాణికులు ప్రయాణిస్తూనే ఉంటారు. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరుకుంటూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా మన దగ్గర ఉన్న విలువైన వస్తువులు అనగా పర్సు మొబైల్ ఫోన్ వంటివి జారి కింద పడిపోతూ ఉంటాయి. కొందరి అజాగ్రత్త వల్ల అలా పడిపోతే మరికొందరు ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ సెల్ఫీలు దిగడం రీల్స్ వంటివి చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వంటివి జారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు చాలామంది ఏం చేయాలో తెలియక పోతే పోయిందిలే అనుకొని బాధపడుతూ ఉంటారు.

కానీ ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందే మార్గం గురించి తెలుసుకుందాం.. ఏ కారణం చేతనైనా మీ మొబైల్ ఫోన్ లేదా పర్స్ రైలు నుండి పడిపోయినట్లయితే, ముందుగా మీరు ట్రాక్ పక్కన ఉన్న పోల్‌పై పసుపు, నలుపు రంగులలో రాసి ఉన్న నంబర్‌ను నోట్ చేసుకోవాలి. దీని కోసం మీరు మీ స్నేహితుడి లేదా రైల్లో ఉన్న ఇతర ప్రయాణికుల ఫోన్‌ను తీసుకుని 139 నంబర్‌ లేదా 182 నంబర్‌కు కాల్‌ చేయాలి. ఈ కాల్‌ రైల్వే హెల్ప్‌లైన్‌ డెస్క్‌ సిబ్బందికి వెళ్తుంది. సిబ్బందికి మీరు పోగొట్టుకున్న వస్తువుల గురించి సమాచారం అందించాలి. అలాగే మీరు నోట్‌ చేసుకున్న పోల్‌ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాలి. అలాగే సిబ్బందికి మీ అడ్రస్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

మీ వస్తువు పడిపోయిన ప్రాంతంలో పోల్‌ నంబర్‌ ఇవ్వడం వల్ల పడిపోయిన వస్తువు కనుగొనడంలో సహాయపడుతుంది. పోల్ నంబర్ సహాయంతో, పోలీసులు మీరు పేర్కొన్న ప్రదేశానికి చేరుకుంటారు. మీ మొబైల్ ఫోన్, పర్సు లేదా మీ విలువైన వస్తువులను గుర్తిస్తారు. వస్తువులను కనుగొని వాటిని తిరిగి ఇస్తామని మాత్రం పోలీసులు హామీ ఇవ్వరు కానీ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లే లోగా ఆ వస్తువు అలాగే ఉంటే తిరిగి ఇస్తారు. కానీ ఎవరికైనా దొరికితే మాత్రం ఇవ్వరని గుర్తించుకోండి. ఒక వేళ రైల్వే సిబ్బంది అక్కడికి వెళ్లేవరకు ఎవరు తీసుకోకుంటే దానిని మీ అడ్రస్‌కు కొరియర్‌ చేస్తారు. నిజానికి రైలులో చైన్ లాగడం నేరం.

కానీ కొన్ని పరిస్థితులలో మీరు చైన్ పుల్లింగ్ చేయవచ్చు. మీతో ప్రయాణిస్తున్న పిల్లలు లేదా వృద్ధులు రైల్వే స్టేషన్‌లో వెనుకబడితే, మీరు చైన్ పుల్లింగ్ చేయవచ్చు. అదే సమయంలో ఒక వికలాంగుడిని స్టేషన్‌లో వదిలి రైలు ప్రారంభమైతే, అటువంటి పరిస్థితిలో కూడా చైన్ పుల్లింగ్ చేయవచ్చు. ఇవన్నీ కాకుండా, రైలులో అగ్నిప్రమాదం, దోపిడీ లేదా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మీరు చైన్ పుల్లింగ్ కూడా చేయవచ్చు.