Twitter : కేంద్రంపై ట్విట్టర్ న్యాయ పోరాటం.. జ్యుడీషియల్ రివ్యూ కోరుతూ రిట్ పిటిషన్

కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న కోల్డ్ వార్ మరింత ముదురుతోంది

  • Written By:
  • Publish Date - July 6, 2022 / 07:00 PM IST

కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న కోల్డ్ వార్ మరింత ముదురుతోంది.అంతర్జాతీయ న్యాయవాద గ్రూప్ ఫ్రీడమ్ హౌస్, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, రైతుల నిరసనకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లను, కొన్ని ట్వీట్లను తొలగించాలని ట్విట్టర్ ను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ ఆదేశాల న్నింటినీ జులై 4లోగా పాటించాలని ట్విట్టర్ కు ఇటీవల తుది నోటీసులు జారీ చేసింది. గడువులోగా నిబంధనలను పాటించకపోతే… ట్విట్టర్ లో పోస్ట్ అయిన అన్ని కామెంట్లకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ సంస్థ కర్ణాటక హైకోర్టులో ఓ రిట్ పిటిషన్ వేసింది. జ్యుడీషియల్ రివ్యూ చేపట్టాలని కోరింది. ” కేంద్ర ప్రభుత్వం మా ప్లాట్‌ఫామ్‌లో పోస్టు అయిన కొంత కంటెంట్‌ను తొలగించాలని, పలు యూజర్లనూ తొలగించాలని వివిధ సందర్భాల్లో ఆదేశాలు జారీ చేసింది. ఐటీ యాక్ట్ సెక్షన్ 69ఏను ఉటంకిస్తూ.. ఆయా ఖాతాలను బ్లాక్ చేయాలని చాలా ఆదేశాలను పంపింది. కానీ, అందులో కొన్ని కేంద్రం చెబుతున్నట్టు 69ఏ కింద తొలగించడానికి అర్హమైనవేమీ కాదు” అని రిట్ పిటిషన్ లో ట్విట్టర్ ప్రస్తావించింది. “”ట్విట్టర్ కు జారీ అయిన కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు.. తొలగించాలని కోరిన కంటెంట్‌ వివరాలను కోర్టు పరిశీలించాలి.. ఇందుకోసం జ్యూడీషియల్ రివ్యూ చేయాలి” అని రిట్ పిటిషన్ లో ట్విట్టర్ కోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ఇటు వినియోగదారుల హక్కులను కాపాడుకోవడానికే ట్విట్టర్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని సమాచారం.

చివరి నోటీసు ఇలా..

జూన్ 26న తాము బ్లాక్ చేసిన 80కి పైగా ట్విట్టర్ అకౌంట్లు, ట్వీట్ల జాబితాను కేంద్రానికి ట్విట్టర్ అందించింది. అయినప్పటికీ తాము చేసిన ఆదేశాల్లో ఇంకా పాటించాల్సినవి చాలా ఉన్నాయని… వాటన్నింటినీ జులై 4లోగా పాటించాలంటూ కేంద్రం చివరి నోటీసును జారీ చేసింది.

జూన్ లోనూ కేంద్రం లేఖ..

కేంద్ర సమాచార, ఐటీ శాఖ అంతకుముందు జూన్ నెలలోనూ ట్విట్టర్ కు ఘాటైన లేఖ పంపింది. తమ ఆదేశాలకు లోబడి నడుచుకోకుంటే ట్విట్టర్ చీఫ్ కంప్లయెన్స్ ఆఫీసర్‌పై క్రిమినల్ చర్యలు మొదలు పెట్టడమే కాకుండా.. ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 79(1) కింద ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌కు లభించే రక్షణ కూడా తొలగిస్తామని హెచ్చరించింది. ఈనేపథ్యంలోనే ట్విట్టర్.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అనేక బ్లాకింగ్ ఆర్డర్‌లను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించింది.