Site icon HashtagU Telugu

Govt asks WhatsApp: వాట్సాప్‌ ఆగిపోవడానికి కారణమేంటో చెప్పండి..!

Whatsapp

Whatsapp

అక్టోబర్ 25వ తేదీన మంగళవారం నాడు మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలు నిలిచిపోవడంపై నివేదిక కోరినట్లు ప్రభుత్వం బుధవారం తెలిపింది. ఈనెల 25న వాట్సాప్‌ రెండు గంటలపాటు ఆగిపోవడానికి గల కారణాలను వారంలోగా తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం సంస్థను ఆదేశించింది. సాంకేతిక సమస్య కారణమా? లేక సైబర్‌ ఎటాక్‌ జరిగిందా? అన్నది చెప్పాలని కోరింది. భారత్‌కు చెందిన కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌తో సమన్వయం చేసుకుంటూ అంతరాయానికి గల కారణాలను అన్వేషించాలని సూచించింది. కాగా, వాట్సాప్‌కు ఇండియాలో 50 కోట్ల మందికి పైగా వినియోగదారులున్నారు.

టెలికమ్యూనికేషన్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. “మేము వాట్సాప్‌ను నివేదిక కోసం అడిగాం. అది వచ్చే నాలుగైదు రోజుల్లో వస్తుందని ఆశిస్తున్నాము” అని అన్నారు.ఈనెల 25న వాట్సాప్‌ రెండు గంటలపాటు ఆగిపోవడంతో చాలా మంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. దీని వెనుక గల కారణాలను తెలియజేయాలని ప్రభుత్వం సోషల్ మెసేజింగ్ యాప్‌ను కోరిందని మంత్రి చెప్పారు.

“ఇది ఒక పెద్ద అంతరాయం. ఎందుకు అంత అంతరాయం ఏర్పడిందో కారణాలు కావాలి” అని మంత్రి పేర్కొన్నాడు. మంగళవారం ప్రపంచవ్యాప్త అంతరాయంలో భాగంగా వాట్సాప్ భారతదేశంలో కూడా దాదాపు రెండు గంటలపాటు పనిచేయలేదు. సాంకేతిక లోపాన్ని మాతృ సంస్థ మెటా పరిష్కరించిన తర్వాత వాట్సాప్ పునరుద్ధరించబడింది. మెటా తదుపరి వివరాలు లేదా కారణాలు చెప్పకుండానే లోపం పరిష్కరించబడిందని ఆరోజు ధృవీకరించింది. “వాట్సాప్‌లో సందేశాలు పంపడంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాకు తెలుసు. మేము సమస్యను పరిష్కరించాం. అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాము”అని మంగళవారం కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

 

 

Exit mobile version