ఈమధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. టెక్నాలజీ పరంగా చాలా అప్ డేట్ అవుతున్నారు. పోలీసులకు పట్టుబడిన నేరస్థులను విచారించినప్పుడు విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. నేరగాళ్లు వ్యక్తుల గుర్తింపును కూడా చోరి చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ గుర్తింపు ఆధారంగా నకిలీ బ్యాంకు అకౌంట్స్ తెరిచి పెద్ద పెద్ద మోసాలకు పాల్పడుతున్నట్లు బయటపడింది.
హైదరాబాద్ సైబర్ పోలీసులు గత నెలలో ఓ నేరస్థుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో ఆ నేరస్థుడు చెప్పిన మాటలు విని అవాక్కవడం పోలీసుల వంతైంది. పట్టుబడిన వ్యక్తి దగ్గరి నుంచి సుమారు రెండువేల మంది వ్యక్తుల వేలిముద్రలు ఉన్నట్లు తెలుసుకున్నారు. వీటి ఆధారంగా నకిలీ గుర్తింపులను తయారు చేసి…మోసాలకు పాల్పడుతున్నట్లు బయటపడింది. అంతేకాదు మరిన్ని విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.ఆ ఫింగర్ ప్రింట్స్ ను అతనడు సొంతగా సంపాదించలేదట. మరో నేరగాడి దగ్గరనుంచి తీసుకున్నాడట. ఇలాంటి వారు ఎంతో మంది ఉండొచ్చని పోలీసులు అంటున్నార. కాబట్టి ప్రజలు తమ గుర్తింపు వివరాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన సైబర్ భద్రత-జాతీయ భద్రత అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ డీసీపీ కమలేశ్వర్ వివరాలను వెల్లడించారు. చోరి చేసిన వ్యక్తిగత వివరాల ఆధారంగా కొత్త సిమ్ కార్డులు తీసుకుని సోషల్ మీడియాలో అకౌంట్స్ తెరుస్తున్నట్లు చెప్పారు. రెండు వేల ఫింగర్ ప్రింట్స్ తో పట్టుబడిన వ్యక్తి…అప్పటికే వాటి సాయంతో సిమ్ కార్డులు కూడా తీసుకున్నట్లు పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్ కార్డులతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కేవైసీ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. పలు బ్యాంకు అకౌంట్స్ ను కూడా సీజ్ చేసినట్లు చెప్పారు. బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దని సూచించారు. అంతేకాదు ఆధార్ తోపాటు ఇతర కేవైసీ జిరాక్స్ లు కూడా ఎవరి ఇవ్వొద్దని…జిరాక్స్ కేంద్రాల్లోనూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.