Call Recording App: కాల్ రికార్డింగ్ యాప్స్ పై గూగుల్ స్ట్రైక్ .. ప్లే స్టోర్ నుంచి ఔట్

గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ లో తాను చేసిన ప్రకటనను తూ.చ తప్పకుండా అమల్లోకి తెచ్చింది.

  • Written By:
  • Publish Date - May 11, 2022 / 01:06 PM IST

గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ లో తాను చేసిన ప్రకటనను తూ.చ తప్పకుండా అమల్లోకి తెచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాల్ రికార్డింగ్ యాప్స్ ను తొలగించింది. మే 11 నుంచి ప్లే స్టోర్ లో కాల్ రికార్డింగ్ యాప్స్ అందుబాటులో లేకుండా చేసింది.
ఒకవేళ ప్లేస్టోర్‌లో మీకు కొన్ని థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ కనిపించినా.. అవి కాల్ రికార్డ్ చేసేందుకు యాక్సెసబులిటీ ఏపీఐను వినియోగించుకోలేవు. అందుకే అవి పని చేయవు. కాల్ రికార్డింగ్ యాప్స్ వల్ల తమ వినియోగదారుల వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలుగుతోందని భావించిన గూగుల్ ఈమేరకు కొరడా ఝుళిపించింది. గతంలో రియల్ టైమ్ కాల్ రికార్డింగ్‌ను ఆండ్రాయిడ్‌ 6లో గూగుల్ నిలిపివేసింది.

అయితే మైక్రోఫోన్ ద్వారా ఇన్ కాల్ ఆడియో రికార్డింగ్‌ను ఆండ్రాయిడ్ 10 నుంచి తెచ్చింది. అయితే, కొన్ని థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్.. ఆండ్రాయిడ్‌లోని కొన్ని లొసుగులను ఆసరాగా చేసుకొని యాక్సెసబులిటీ సర్వీసెస్‌కు యాక్సెస్ తీసుకుంటున్నాయి. ఈ చర్యలను తీవ్రంగా పరిగణించిన గూగుల్..థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ కు పూర్తిగా చెక్ పెట్టింది. అయితే మీ మొబైల్‌లో ఇన్‌బుల్ట్‌గా కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉంటే దానిపై ఎలాంటి ప్రభావం ఉండదు. అది సాధారణంగా పని చేస్తుంది. గూగుల్ కు చెందిన ‘డయలర్’ యాప్ లో కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇది చాలా పారదర్శకమైంది. ఇందులోని కాల్ రికార్డింగ్ ను ఆన్ చేయగానే ‘ ఈ కాల్ రికార్డు చేయబడుతుంది’ అనే సందేశం ఫోన్లో మాట్లాడుతున్న ఇద్దరికీ వినిపిస్తుంది. ఈనేపథ్యంలో ‘ ట్రూ కాలర్’ (Truecaller)యాప్ కూడా కాల్ రికార్డింగ్ ఫీచర్ ను తొలగించినట్టు వెల్లడించింది. “గూగుల్ డెవలపర్ ప్రోగ్రామ్ పాలసీలో అప్‌డేట్‌ ప్రకారం మేం కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను అందించలేం. ఇన్‌బుల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉన్న వారిపై ఇది ప్రభావం చూపదు” అని ట్రూకాలర్ ప్రతినిధి వెల్లడించారు.