Site icon HashtagU Telugu

WhatsApp bug :అదంతా “బగ్” మాయ.. వాట్సాప్ తప్పు లేదు

Whatsapp Microphone Access

Whatsapp Microphone Access

ఫోన్ లోని మైక్ ను వాట్సాప్ ఇష్టారాజ్యంగా యాక్సెస్ చేస్తోందంటూ వచ్చిన ఆరోపణలపై గూగుల్ స్పందించింది. మైక్ ద్వారా యూజర్స్ మాటలను వాట్సాప్ వింటోందనే ఆరోపణ అవాస్తవమని.. ఆండ్రాయిడ్‌లో ఏర్పడిన ఒక బగ్‌ (WhatsApp bug) వల్ల కొందరికి ఇలాంటి సమస్య తలెత్తుతోందని స్పష్టం చేసింది. వాట్సాప్ యూజర్స్ కు తప్పుడు ప్రైవసీ వార్నింగ్స్ ఇస్తున్న ఒక బగ్ ను ఆండ్రాయిడ్‌లో గుర్తించామని గూగుల్ కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ బగ్(WhatsApp bug) వాట్సాప్ ప్రైవసీ డ్యాష్ బోర్డులో ఉంటూ.. తప్పుడు ప్రైవసీ నోటిఫికేషన్స్, మెసేజ్ లను జనరేట్ చేస్తోందని వివరించారు. ఆ కారణం వల్లే వాట్సాప్ ఉపయోగంలో లేనప్పుడు కూడా.. వినియోగదారుల ఫోన్ లోని మైక్ ను వాట్సాప్ యాక్సెస్ చేస్తున్నట్లు అనిపిస్తుందని తెలిపారు. ఈ బగ్ కు విరుగుడును తయారు చేసే పనిలోనే నిమగ్నమై ఉన్నామని గూగుల్ కంపెనీ ప్రతినిధి తేల్చి చెప్పారు.

ట్విట్టర్‌ ఇంజనీర్ ట్వీట్ తో రచ్చ..

కొన్ని రోజుల క్రితం ట్విట్టర్‌లో పనిచేస్తున్న ఒక ఇంజనీర్.. “నేను నిద్రలో ఉన్నప్పుడు కూడా వాట్సాప్ నా హ్యాండ్‌సెట్ మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేసింది” అంటూ స్క్రీన్ షాట్లతో సహా ట్వీట్ చేయడం తాజా వివాదానికి దారి తీసింది. వాట్సాప్ అనేది గూగుల్ కు చెందిన ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫామ్ పై పనిచేస్తోంది. దీంతో మైక్రో ఫోన్ యాక్సెస్ అంశాన్ని గూగుల్ దృష్టికి వాట్సాప్ తీసుకెళ్లింది. దానిపై ఆండ్రాయిడ్ నిపుణుల టీమ్ తో దర్యాప్తు చేయించిన గూగుల్ తాజా ప్రకటనను విడుదల చేసింది.