iPhone-14: ఐఫోన్ యూజర్స్ కు గుడ్ న్యూస్‌.. ఇండియాలో ‘ఐఫోన్‌-14’ త‌యారీ!

టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్14కు విశేష స్పంద‌న ల‌భించింది.

  • Written By:
  • Publish Date - September 26, 2022 / 04:39 PM IST

టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్14కు విశేష స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో యాపిల్ సంస్థ ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇండియాలో యాపిల్ ఉత్పత్తుల విక్రయాన్ని మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం ప్ర‌ణాళిక‌ల‌ను సైతం సిద్ధం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఐఫోన్‌-14ను భారత్‌లోనే తయారు చేయాలని యాపిల్ సంస్థ నిర్ణ‌యం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్‌లో చైనా త‌ర్వాత భార‌త‌దేశంలో ఉన్న అవ‌కాశాల‌ను అందిపుచ్చుకునేందుకు సంస్థ ఈ నిర్న‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చైనాలో క‌రోనా ఆంక్ష‌ల నేప‌థ్యం, రాజ‌కీయ ప‌రిస్థితుల కార‌ణంగా చైనా నుంచి ఐఫోన్ల త‌యారీ కేంద్రాన్ని వేరే ప్రాంతాల‌కు మ‌ళ్లించాల‌ని చూస్తుంటం కూడా కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు.

2017లో యాపిల్ సంస్థ‌ ఐఫోన్‌-ఎస్‌ఈతో భారత్‌లో త‌మ కార్య‌క‌లాపాల‌ను మొద‌లుపెట్టింది. ఐఫోన్‌ ఎస్‌ఈ, ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 13ను యాపిల్ దేశీయంగా ఉత్పత్తి చేస్తోంది. తాజాగా ఐఫోన్‌-14 కూడా ఆ జాబితాలో చేరనుంది. మరికొన్ని రోజుల్లోనే మేడిన్‌ ఇన్‌ ఇండియా ఐఫోన్‌-14 దేశీయ వినియోగదారుల చేతుల్లోకి చేరుతుందని యాపిల్ కంపెనీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. చెన్నై శివార్లలో ఉన్న ఫాక్స్‌కాన్‌ తయారీ కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు వీటిని సరఫరా చేయనున్నారు.

మొత్తం ఐఫోన్‌లలో 95 శాతానికి పైగా ఇప్పటికీ చైనాలోనే తయారవుతున్నాయి. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం.. ప్రభుత్వం అందించే పీఎల్ఐ పథకం కింద కంపెనీ 2025-26 నాటికి మొత్తం ఉత్పత్తిలో 12 శాతం ఐఫోన్‌లను భారత్‌లో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా ఉంది.