Site icon HashtagU Telugu

Helpline Numbers: మీ ఫోన్లో ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ లేకుంటే వెంటనే ఆడ్ చేసుకోండి.. లేదంటే?

Mixcollage 01 Dec 2023 06 57 Pm 4747

Mixcollage 01 Dec 2023 06 57 Pm 4747

మామూలుగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, గొడవలు జరుగుతున్నప్పుడు వివిధ అత్యవసర పరిస్థితుల్లో పౌరులకు తక్షణ సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే అనేక ప్రభుత్వ విభాగాలు హెల్ప్‌లైన్ నంబర్‌ల సౌకర్యాన్ని అందిస్తాయి. తద్వారా పౌరులు అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్‌ లకు కాల్ చేయడం ద్వారా తక్షణ సహాయం పొందవచ్చు. ఇంతకీ ఆ హెల్ప్ లైన్ నెంబర్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎప్పుడు అయిన అకస్మాత్తుగా అగ్నిప్రమాదం జరిగితే వెంటనే మీరు అగ్నిమాపక దళానికి కాల్ చేయాలి.

అందుకోసం 101 కి డయల్ చేయాలి. మంటలను ఆర్పడానికి పనిచేసే అగ్నిమాపక విభాగం సంఖ్య ఇది. చాలా మంది ఫైర్ సర్వీస్ అనుకొని 100కి కాల్ చేస్తుంటారు. 101కి కాల్ చెయ్యాలి. ఒకవేళ 100కి కాల్ చేస్తే, పోలీసులు కనెక్ట్ అవుతారు. వారు మీ సమాచారాన్ని ఫైర్ విభాగానికి చేరవేస్తారు. అత్యవసర పరిస్థితులలో అలా అయినా మీరు చేయవచ్చు. కాబట్టి 101 అగ్నిమాపక సిబ్బందికి, 100 పోలీసులకు టోల్ ఫ్రీ నెంబర్లు అని చెప్పవచ్చు.. అలాగే ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక ఎమర్జెన్సీ అయితే వెంటనే 108, లేదంటే 102 నెంబర్లకు డైల్ చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో వైద్య సౌకర్యాన్ని పొందవచ్చు. అందువల్ల ఒక నంబర్ బిజీగా ఉంటే, వెంటనే మరో నంబర్ ట్రై చెయ్యవచ్చు.

రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో, మీరు టోల్ ఫ్రీ నంబర్ 103కి కాల్ చేయడం ద్వారా ట్రాఫిక్ పోలీసుల నుంచి సహాయం పొందవచ్చు. అదే విధంగా మీకు ఏదైనా సమస్య ఎదురైతే 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవచ్చు. చాలా మందికి ఈ నంబర్లు ఉన్నాయని తెలియదు. అందువల్ల వీటికి కాల్స్ తక్కువగా వస్తుంటాయి. మీరు ఎప్పుడైనా రైలులో ప్రయాణిస్తున్న సమయంలో రైలు ప్రమాదం జరిగితే వెంటనే మీరు 1072 నెంబర్ కు కాల్ చేయాలి. రోడ్డు ప్రమాదం జరిగితే, సహాయం కోసం 1073 నంబర్‌కు కాల్ చేయవచ్చు. ఈ రెండు నంబర్లనూ మొబైల్‌లో సేవ్ చేసుకోవడం చాలా మంచిది.

అదేవిధంగా మహిళలకు సహాయం చేయడానికి దేశంలో మహిళా హెల్ప్ లైన్ కూడా నడుస్తోంది. మహిళలకు ఏదైనా కష్టం అనిపిస్తే వెంటనే 1090/1091కు కాల్ చేయడం ద్వారా ఎలాంటి అఘాయిత్యాలు లేదా దోపిడీ జరగకుండా ఆపవచ్చు. 1098 అనేది పిల్లలపై జరుగుతున్న అన్యాయాల సమాచారం ఇచ్చేందుకు ఉన్న టోల్ ఫ్రీ నంబర్. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 కి కాల్ చేసి సహాయాన్ని పొందవచ్చు. మీ ఇల్లు, దుకాణం లేదా హోటల్‌లోని సిలిండర్ నుంచి LPG లీక్ అవుతున్నట్లయితే, మీరు ఇప్పుడు అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 1906కు ఫిర్యాదు చేయవచ్చు.