Twitter vs Apple: యాపిల్‌ తో పోరాటానికి సిద్ధమైన ఎలాన్ మస్క్‌..!

ఎలాన్ మస్క్‌ ట్విటర్‌ ను హస్తగతం చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. సామాజిక మాధ్యమంలోని కొన్ని ఫీచర్లలో మార్పులు తీసుకొచ్చారు.

ఎలాన్ మస్క్‌ ట్విటర్‌ ను హస్తగతం చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. సామాజిక మాధ్యమంలోని కొన్ని ఫీచర్లలో మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలాన్ మస్క్‌ ఏకంగా టెక్‌ దిగ్గజం అయిన యాపిల్‌ తో పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ విషయంలో ఎలాన్ మస్క్‌ పెద్ద సాహసమే చేస్తున్నారని నిపుణులు అంటున్నారు.

ట్విటర్‌ లో యాపిల్‌ తమ ప్రకటనల్ని నిలిపివేసిందని ఎలాన్ మస్క్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. అలాగే తమ యాప్‌ స్టోర్‌ నుంచి ట్విటర్‌ ను తొలగిస్తామని కూడా యాపిల్‌ బెదిరిస్తోందని ఆరోపించారు. మరోవైపు ఈ దాడి తన మరో కంపెనీ అయిన టెస్లాపై కూడా కొనసాగుతుందా అని యాపిల్‌ను ప్రశ్నించారు. ఇలా వరుస ట్వీట్లతో యాపిల్‌ పై ఎలాన్ మస్క్‌ ఓ రకంగా యుద్ధాన్నే ప్రారంభించారు. పైగా ‘అసలు ఏం జరుగుతోంది’ అని యాపిల్‌ సీఈఓ ‘టిమ్‌ కుక్‌’ ను ప్రశ్నించారు. ట్విటర్‌ కు ప్రకటనల ద్వారా వస్తున్న ఆదాయంలో యాపిల్‌ దే సింహభాగం. ఈ నేపథ్యంలో ఈ సామాజిక మాధ్యమం మనుగడకు యాపిల్‌ చాలా కీలకం. గత కొన్నేళ్లుగా యాపిల్‌ ట్విటర్‌ కు ప్రకటనలు ఇస్తూ వస్తోంది. ట్విటర్‌ కంపెనీతో సంప్రదింపులు, సంబంధాల నిర్వహణ కోసం యాపిల్‌ ఏకంగా ఓ బృందాన్నే నియమించింది. ట్విటర్‌ లో ప్రకటనల కోసం యాపిల్‌ ఏకంగా ఏటా దాదాపు 100 మిలియన్‌ డాలర్లపైనే ఖర్చు చేస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఎలాన్ మస్క్‌ ప్రవేశంతో ట్విటర్‌ లో రిస్క్‌ ప్రారంభమైందని, యాపిల్‌ అలాంటి సాహసాలను తీసుకోవడానికి సిద్ధంగా లేదని ప్రముఖ మార్కెటింగ్‌ రంగ నిపుణులు ‘లూ పాస్కలిస్‌’ తెలిపారు. ట్విటర్‌ యూజర్లకు యాపిల్‌ ప్రధాన గేట్‌వే గా కూడా ఉంది. యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా దాదాపు 1.5 బిలియన్‌ పరికరాల్లో ట్విటర్‌ ను వినియోగిస్తున్నారు. ఒకవేళ ట్విటర్‌ ను తమ స్టోర్‌ నుంచి తొలగించాలని యాపిల్‌ నిర్ణయిస్తే అవన్నీ సామాజిక మాధ్యమానికి దూరం కావాల్సి వస్తుంది. అయితే, వాక్‌స్వేచ్ఛను యాపిల్‌ వ్యతిరేకిస్తోందంటూ ఎలోన్ మస్క్‌ తాజాగా ప్రచారం మొదలు పెట్టారు. తాను వాక్‌స్వేచ్ఛ కోసం పోరాడుతున్నానంటూ ఎలాన్ మస్క్‌ తన ప్రతిష్ఠను పెంచుకునే ప్రయత్నమూ చేసే అవకాశం ఉంది.