Site icon HashtagU Telugu

Elon Musk : ట్విటర్‌పై ఎలాన్‌ మస్క్‌ కౌంటర్‌ దావా.. భవితవ్యం ఏమిటి?

elon musk

elon musk twitter

ట్విటర్‌ దావాను న్యాయస్థానంలో ఎదుర్కొనేందుకు అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సిద్ధమయ్యారు. కోర్టులో కౌంటర్ దావా దాఖలు చేశారు. ట్విటర్‌ తో కుదుర్చుకున్న రూ.3.50 లక్షల కోట్ల కొనుగోలు డీల్ ను రద్దు చేసుకుంటానని ఎలాన్‌ మస్క్‌ జూలై 8న ప్రకటించారు. దీంతో వెంటనే ట్విట్టర్ యాజమాన్యం కోర్టుకు ఎక్కింది. ఎలాన్‌ మస్క్‌ షరతులకు లోబడి ఒప్పందాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 164 పేజీల పిటిషన్‌ వేసింది. ఒప్పందంలో అంగీకరించినట్లుగా ఒక్కో షేరును 54.20 డాలర్ల వద్ద కొనేలా మస్క్ ను ఆదేశించాలని కోరింది. ట్విటర్‌ దావాపై అక్టోబరు 17 నుంచి 21 వరకు విచారణ జరపనున్నట్లు డెలావర్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది జరిగిన కొద్ది గంటలకే ట్విటర్‌ దావాను సవాల్‌ చేస్తూ మస్క్‌ కౌంటర్ దావా వేశారు. అయితే ఈ దావాపై ట్విటర్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ట్విటర్‌ షేరు విలువ 41.60 డాలర్ల వద్ద ట్రేడ్‌ అయ్యింది. మస్క్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత ట్విటర్ షేర్లు భారీగా పతనమవ్వగా.. ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటున్నాయి.

ఓ వాటాదారు కూడా..

ట్విట్టర్ కొనుగోలు డీల్ ను పూర్తి చేసేలా మస్క్ ను ఆదేశించాలని కోరుతూ ట్విట్టర్ కు చెందిన ఓ వాటాదారు కూడా కోర్టును ఆశ్రయించారు. కంపెనీ కొనుగోలు ప్రక్రియ నుంచి తప్పుకోవడం ద్వారా మస్క్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. తద్వారా ట్విట్టర్ కు కలిగిన నష్టాలకు ఆయన పరిహారం చెల్లించాల్సి ఉంటుందని  పేర్కొన్నారు.

డీల్ రద్దుకు కారణం ?

రోజు 1 మిలియన్ అంటే 10 లక్షలకు పైగా స్పామ్ అకౌంట్లను ట్విట్టర్ తొలగిస్తోందని ఆ సంస్థకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ప్లాట్‌ఫామ్‌లో ప్రమాదకరమైన ఆటోమేటెడ్ బాట్స్‌ (Bots)ను తొలగించేందుకు ట్విట్టర్ నిరంతరం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్లాట్‌ఫామ్‌లో 5శాతం కంటే తక్కువగానే స్పామ్, బాట్ అకౌంట్లు ఉన్నాయని ట్విట్టర్ తనకు చెప్పిందని, దీన్ని నిరూపించాలని స్పేస్ ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ డిమాండ్ చేస్తున్నారు. స్పామ్ అకౌంట్ల విషయంలో ట్విట్టర్ అసత్యాలు చెబుతుందంటూ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే 5 శాతం మాత్రమే స్పామ్ అకౌంట్లు ఉన్నాయని ట్విట్టర్ 2013లో పేర్కొంది. అప్పటి నుంచి ఆ గణాంకాలను మాత్రం మార్చలేదని సమాచారం.