Twitter : ట్విట్టర్‌ ను కొనేందుకే ఎలాన్‌ మస్క్‌ మొగ్గు!!

ట్విట్టర్‌ ను కొనే దిశగానే ఎలాన్‌ మస్క్‌ అడుగులు వేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - October 5, 2022 / 01:29 PM IST

ట్విట్టర్‌ ను కొనే దిశగానే ఎలాన్‌ మస్క్‌ అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారమే ట్విట్టర్ కొనుగోలు డీల్ ఉంటుందని తెలుస్తోంది. దాని ప్రకారం.. ఒక్కో ట్విట్టర్‌ షేరును 54.20 డాలర్ల చొప్పున 4,400 కోట్ల డాలర్లకు కొనేందుకు ఎలాన్‌ మస్క్‌ అంగీకరించినట్టు సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం ట్విట్టర్‌ షేర్లు ఒక్కసారిగా 13 శాతం పెరిగి 47.95 డాలర్లకు చేరాయి. దాంతో ఈ కౌంటర్‌లో ట్రేడింగ్‌ నిలిపి వేశారు. నకిలీ ఖాతాల విషయం కోర్టులో నిరూపించడం కష్టమని తేలడంతో మస్క్‌.. ఇక ట్విట్టర్ ను కొనుగోలు చేయడమే మంచిదని నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ట్విట్టర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు గత ఏప్రిల్‌లో మస్క్‌ అంగీకరించిన విషయం తెలిసిందే.

 

ఈ ఏడాది ప్రారంభంలో… ట్విట్టర్​లో దాదాపు 9శాతం వాటాను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ట్విట్టర్ మొత్తాన్ని​ కొనుగోలు చేసేందుకు ఆఫర్​ ఇచ్చారు. ఎలాన్​ మస్క్​ -ట్విట్టర్​ మధ్య 44బిలియన్​ డాలర్ల డీల్​ కుదిరింది. ట్విట్ట‌ర్‌ను కొనేందుకు ఏప్రిల్‌లో ఓకే చెప్పినా,..మే నెల‌లో ఆ డీల్‌పై మ‌స్క్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. స్పామ్‌, ఫేక్ అకౌంట్ల‌పై పూర్తి సమాచారం ఇవ్వకుండా ఒప్పంద నిబంధనలను ట్విట్టర్ ఉల్లంఘించిందని మస్క్ ఆరోపించారు. ఫేక్ అకౌంట్స్ వల్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ దుర్వినియోగానికి గురవుతుందని ఆయన పేర్కొన్నారు.దీనిపై కోర్టును ఆశ్రయించారు. ఆ అంశాన్నే కారణంగా చూపించి ఒప్పందం నుంచి మస్క్ వైదొలిగారు. దీనిపై ట్విట్టర్ కూడా కోర్టును ఆశ్రయించింది. మ‌స్క్ అంగీక‌రించిన ధ‌ర‌కు, ష‌ర‌తుల‌కు లోబ‌డే క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ట్విట్ట‌ర్ బోర్డ్ చైర్మెన్ బ్రెట్ టేల‌ర్ తెలిపారు. విలీన ఒప్పందాన్ని అమలు చేయడానికి చట్టపరమైన చర్యలు కొనసాగించాలని బోర్డు యోచిస్తోందని ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలర్ ట్వీట్ చేశారు. ప్రతిరోజూ 1 మిలియన్ స్పామ్ ఖాతాలను ప్లాట్‌ఫారమ్ నుండి తీసివేస్తున్నామని తెలిపారు. ప్లాట్‌ఫామ్‌లో ప్రమాదకరమైన ఆటోమేటెడ్ బాట్స్‌ (Bots)ను తొలగించేందుకు ట్విట్టర్ నిరంతరం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు.ఎట్టకేలకు ట్విట్టర్ పట్టుదలకు, న్యాయ పోరాటానికి మస్క్ తలొగ్గారు. తాను ఇంతకు ముందు ప్రతిపాదించిన రేటు ప్రకారమే ట్విట్టర్ షేర్లు కొనేందుకు రెడీ అయ్యారు.