Tesla Job Cut: ఆందోళనకరంగా ఆర్థిక వ్యవస్థ.. టెస్లా లో 10% ఉద్యోగ కోతలు: మస్క్

అమెరికా కుబేరుడు "ఎలాన్ మస్క్" ఏది మాట్లాడినా సంచలనమే!! ఎందుకంటే.. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు.

  • Written By:
  • Publish Date - June 4, 2022 / 08:45 AM IST

అమెరికా కుబేరుడు “ఎలాన్ మస్క్” ఏది మాట్లాడినా సంచలనమే!! ఎందుకంటే.. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. “ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నో ప్రతికూలతలను ఎకానమీ చవిచూస్తోంది” అని మస్క్ పేర్కొన్నారు.

ఈనేపథ్యంలో టెస్లా కార్ల కంపెనీలో 10 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నామని తెలిపారు. ఈమేరకు వివరాలతో కూడిన ఒక సందేశాన్ని ఆయన టెస్లా కంపెనీ ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఈమెయిల్ చేశారు. ఇప్పుడు దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. “వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నవారంతా ఇక ఆఫీస్ కు తిరిగి రావాలి. లేదంటే.. వాళ్లంతా రాజీనామా చేసినట్టుగా పరిగణించాల్సి ఉంటుంది” అంటూ రెండు రోజుల క్రితం మస్క్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ చేసిన కొద్ది రోజులకే.. 10 శాతం ఉద్యోగ కోతలు చేస్తామంటూ మస్క్ తమ కంపెనీ ఉన్నతాధికారులకు ఈమెయిల్స్ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అమెరికాలో ప్రస్తుతం ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ట స్థాయికి పెరిగింది. ద్రవ్యోల్బణం తగ్గించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ నానా తంటాలు పడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మస్క్ ఆచితూచి ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.