Wifi Using Tips: స్మార్ట్‌ఫోన్ ఈ రోజుల్లో మన జేబులో ఉండే అత్యంత శక్తివంతమైన పరికరంగా మారింది. బ్యాంకింగ్ నుండి సోషల్ మీడియా వరకు మన జీవితంలో సగం దీనిపైనే ఆధారపడి ఉంది. అయితే ఈ ఫోన్ విషయంలో మనం చేసే ఒక చిన్న నిర్లక్ష్యం మనల్ని పెద్ద సైబర్ ప్రమాదంలో పడేయవచ్చు. చాలా మంది ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మొబైల్ డేటాను ఆన్ చేస్తారు. కానీ వై-ఫైని ఆపివేయడం మర్చిపోతుంటారు.
నెట్‌వర్క్ కనెక్ట్ కానప్పుడు వచ్చే నష్టం ఏముందని వారు అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే వై-ఫై ఆన్ చేసి ఉన్నప్పుడు మీ ఫోన్ నిరంతరం చుట్టుపక్కల ఉన్న నెట్‌వర్క్‌ల కోసం వెతుకుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియ మీ లొకేషన్, డివైజ్ యాక్టివిటీ, డిజిటల్ గుర్తింపును గుర్తుతెలియని వ్యక్తులకు సులభంగా చేరేలా చేస్తుంది. హ్యాకింగ్, డేటా లీక్‌లకు ఇది మొదటి ద్వారమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: 1988లో ఆపరేషన్ కాక్టస్.. మాల్దీవుల అధ్యక్షుడిని కాపాడిన భారత సైన్యం!
వై-ఫై ఆన్ చేసి ఉంచడం వల్ల కలిగే ప్రమాదాలు
సిగ్నల్ ట్రాకింగ్: మీ ఫోన్ వై-ఫై ఆన్ ఉన్నప్పుడు అది బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది. గతంలో మీ ఫోన్ ఏ నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అయ్యింది.. అది ఏ రకమైన పరికరం అనే సమాచారాన్ని ఈ సిగ్నల్స్ వెల్లడిస్తాయి.
ఈవిల్ ట్విన్ అటాక్: హ్యాకర్లు మీ ఫోన్ పంపే సిగ్నల్స్ ఆధారంగా నకిలీ నెట్‌వర్క్‌లను సృష్టిస్తారు. మీ ఫోన్ వాటిని సురక్షితమైనవిగా భావించి దానంతట అదే కనెక్ట్ అవుతుంది. మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడే మీకు తెలియకుండానే ఎవరో ఒకరు మీ ఫోన్ డేటాను గమనిస్తూ ఉండవచ్చు.
డేటా లీక్ అయ్యే అవకాశం: మాల్స్, స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు లేదా కెఫేలలో చాలా ఓపెన్ వై-ఫై నెట్‌వర్క్‌లు కనిపిస్తాయి. ఇవన్నీ సురక్షితమైనవి కావు. మీ వై-ఫై ఆన్ ఉంటే మీ ఫోన్ పొరపాటున డేటా దొంగిలించడానికి సృష్టించిన నకిలీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
బ్యాంకింగ్ సమాచారం ప్రమాదంలో: ఒకసారి నకిలీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయితే మీ బ్రౌజింగ్ యాక్టివిటీ, లాగిన్ వివరాలు, కొన్నిసార్లు బ్యాంకుకు సంబంధించిన కీలక సమాచారం కూడా హ్యాకర్ల చేతికి చిక్కవచ్చు.
