Bullet Train To Space: చంద్రుడు, అంగారకుడిపైకి బుల్లెట్ ట్రైన్.. జపాన్ యోచన!!

హీరో బాలకృష్ణ నటించిన "ఆదిత్య 369" మూవీ గుర్తుందా ? టైం మిషన్ ఎక్కి కాలంలో ప్రయాణించే సీన్..

  • Written By:
  • Publish Date - July 18, 2022 / 10:00 AM IST

హీరో బాలకృష్ణ నటించిన “ఆదిత్య 369” మూవీ గుర్తుందా ? టైం మిషన్ ఎక్కి కాలంలో ప్రయాణించే సీన్.. చుట్టూ ఉన్న గ్రహాలను టైం మిషన్ నుంచి చూసే సీన్ అబ్బురపరిచేలా ఉంటుంది. అలాంటి టైం మిషన్ ను తలపించే ఒక బుల్లెట్ ట్రైన్ ను తయారు చేయాలని జపాన్ యోచిస్తోందట. ఈ బుల్లెట్ ట్రైన్ లోకి ఎక్కితే.. చంద్రుడు, అంగారకుడిపైకి వెళ్లి రావచ్చట. జపాన్ లోని క్యోటో యూనివర్సిటీ , కాజిమా కన్ స్ట్రక్షన్స్ సంయుక్తంగా ఈ బుల్లెట్ ట్రైన్ ను అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తాయంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇతర గ్రహాలకు టూర్ పై వెళ్లేందుకు ఉపయోగపడే ఈ బుల్లెట్ ట్రైన్ కు “హెక్సా ట్రాక్” అని పేరు పెట్టారట.

నిర్మాణం ఎలా ?

అంతరిక్ష వాతావరణంలోకి వెళ్లే వస్తువులు తేలియాడుతాయి.దీనికి కారణం అక్కడి ఉపరితలానికి భూమి తరహాలో గురుత్వాకర్షణ బలం లేకపోవడం . దీన్నే సాంకేతిక పరిభాషలో జీరో గ్రావిటీ అంటారు.
ఈ పరిమితిని అధిగమించేలా “హెక్సా ట్రాక్” బుల్లెట్ ట్రైన్ ను అభివృద్ధి చేస్తున్నారని సమాచారం. చంద్రుడి పై, అంగారకుడిపై ప్రయాణించే క్రమంలో ఈ రైలు జీరో గ్రావిటీ ప్రభావానికి లోను కాకుండా ..1జీ గ్రావిటీ స్థాయిని కలిగి ఉండేలా టెక్నాలజీని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రైలలోని బోగీలు ఆరు భుజాలు కలిగిన షడ్భుజి (హెక్సా క్యాప్సూల్స్) ఆకారంలో ఉంటాయని అంటున్నారు. తొలివిడతలో ఒకే ఒక బోగీతో ఉన్న బుల్లెట్ ట్రైన్ ను చంద్రుడు లేదా అంగారకుడిపైకి పంపాలని ప్లాన్ చేస్తున్నారు.

బోగీలు ఇలా..

ఈ మినీ బుల్లెట్ ట్రైన్ బోగీ సైజు 15 మీటర్ల నుంచి 30 మీటర్ల రేడియస్ తో ఉంటుందని చెబుతున్నారు. భూమి నుంచి చంద్రుడి పైకి వెళ్లేందుకు 15 మీటర్ల రేడియస్ కలిగిన బుల్లెట్ ట్రైన్ బోగీ వాడొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. చంద్రుడి నుంచి నేరుగా అంగారకుడి పైకి వెళ్లే బుల్లెట్ ట్రైన్ బోగీ సైజు 30 మీటర్ల రేడియస్ తో ఉంటుంది. జర్మనీ, చైనాల్లో మాగ్లెవ్ బుల్లెట్ ట్రైన్లలో ఎలక్ట్రో మ్యాగ్నటిక్ టెక్నాలజీ వాడుతారు. దీన్ని కూడా
“హెక్సా ట్రాక్” బుల్లెట్ ట్రైన్ లో వాడుతారని భావిస్తున్నారు. ఈ ట్రైన్ వెళ్లేందుకు భూమిపై ఏర్పాటు చేయనున్న స్టేషన్ కు “టెర్రా స్టేషన్” అని పేరు పెట్టనున్నారు. ఈ ట్రైన్ లో వెళ్లే స్పేస్ టూరిస్టులకు , వ్యోమగాములకు భూమి తరహా ఫీలింగ్ కలిగించేందుకు.. కృత్రిమ గురుత్వాకర్షణ ఉండే ఏర్పాటు చేస్తారు. అంతరిక్షంలో చంద్రుడు, అంగారకుడి చలనం వల్ల వెలువడే సెంట్రీ ఫ్యూజల్ శక్తిని సేకరించి వినియోగించుకొని కృత్రిమ గురుత్వాకర్షణను పుట్టించేలా “హెక్సా ట్రాక్” బుల్లెట్ ట్రైన్ లో టెక్నాలజీ ఉంటుందట.ట్రైన్ బోగీ లోపల షాంపెన్ ఫ్లూట్ ఆకారంలో లివింగ్ స్పేస్ ఉంటుంది. ఇందులోనే గార్డెన్, వాటర్ పూల్ కూడా ఉంటాయి. ఈ ట్రైన్ అందుబాటులోకి రావడానికి మరో వందేళ్లు పట్టొచ్చు. అయితే 2050కల్లా ఈ ట్రైన్ బోగీల నమూనాలను విడుదల చేసే అవకాశం ఉంది.