Judge VS Elon Musk : బ్రెజిల్‌లో ఎక్స్ (ట్విట్టర్)కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. తక్షణమే దేశంలో ఎక్స్ సేవలను పూర్తిస్థాయిలో ఆపేయాలంటూ బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలెగ్జాండర్ డి మోరేస్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. బ్రెజిల్ ప్రభుత్వానికి రూ.27.66 కోట్ల జరిమానాలను చెల్లించడంతో పాటు దేశంలో ఒక న్యాయ ప్రతినిధిని నియమించే వరకు ఎక్స్‌పై బ్యాన్ కొనసాగుతుందని న్యాయమూర్తి మోరేస్ స్పష్టం చేశారు. ఈమేరకు దేశ టెలికాం నియంత్రణ సంస్థ అనాటెల్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు అందిన 24 గంటల్లోగా అవి తప్పకుండా అమలు చేయాలని నిర్దేశించారు. ఒకవేళ ఎవరైనా వ్యక్తులు లేదా కంపెనీలు ఈ నిషేధాన్ని ధిక్కరించి వర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్ (వీపీఎన్) ద్వారా ఎక్స్‌ను యాక్సెస్ చేసేందుకు యత్నిస్తే రూ.7.47 లక్షల జరిమానా విధించాలని అనాటెల్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మోరేస్(Judge VS Elon Musk) సూచించారు.
We’re now on WhatsApp. Click to Join
తప్పుడు వార్తలను వ్యాపింపజేసేందుకు కొన్ని డిజిటల్ ముఠాలు కుట్ర చేస్తున్నాయని, అలాంటి అకౌంట్లను గుర్తించి బ్లాక్ చేయాలని ఈ ఏడాది ప్రారంభంలో ఎక్స్‌ను బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మోరేస్ ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను అప్పట్లో ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ వ్యతిరేకించారు. ఎక్స్ సోషల్ మీడియా కంటెంట్‌పై సెన్సార్‌షిప్‌ను అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇక తాము బ్రెజిల్‌లో ఆఫీసును మూసేస్తామని ప్రకటించారు.ఆఫీసును మూసేసినా బ్రెజిల్‌లోని తమ సోషల్ మీడియా యూజర్ల అకౌంట్లు యాక్టివ్‌గానే ఉంటాయని తెలిపారు.
ఈ తరుణంలో బ్రెజిల్ సుప్రీంకోర్టు మరో కీలక ఆదేశం జారీ చేసింది. ఎలాన్ మస్క్‌కు స్టార్ లింక్ అనే మరో కంపెనీ ఉంది. అది కూడా బ్రెజిల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్టార్ లింక్ బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేయాలని బ్రెజిల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు జడ్జి అలెగ్జాండర్ డి మోరేస్ ఆర్డర్ ఇచ్చారు.