Site icon HashtagU Telugu

Bit Chat : ఇంటర్నెట్ లేకుండా పనిచేసే మెసేజింగ్ యాప్ బిట్‌చాట్

Bit Chat

Bit Chat

Bit Chat : ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ లాంటి అనేక సోషల్ మీడియా యాప్స్ మనకందరికీ పరిచయమే. ఈ యాప్స్ ద్వారా టెక్స్ట్ మెసేజ్‌లు, ఆడియోలు, వీడియోలు, ఫోటోలు పంపడం సాధ్యమే అయినా… ఇవన్నీ పనిచేయడానికి నెట్ కనెక్షన్ తప్పనిసరి. కానీ ఇప్పుడు, ఇంటర్నెట్ అవసరం లేకుండానే మెసేజ్ చేసుకునే అవకాశం కల్పించే అద్భుత యాప్ ఒకటి అందుబాటులోకి రాబోతోంది. అదే బిట్‌చాట్ (Bitchat). ఈ యాప్‌ను ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం, ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే అభివృద్ధి చేశారు.

బిట్‌చాట్ ప్రత్యేకత ఏంటంటే, ఇది పూర్తిగా పియర్ టు పియర్ (P2P) ఆధారంగా పనిచేస్తుంది. అంటే దీనికి న సర్వర్ అవసరం, న ఫోన్ నెట్‌వర్క్ అవసరం, న ఇంటర్నెట్ అవసరం. ఈ యాప్ గోప్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. మీరు బిట్‌చాట్ ఉపయోగించి మీ చుట్టూ ఉన్న 30 మీటర్ల పరిధిలో ఉన్న వ్యక్తులతో నేరుగా చాట్ చేయవచ్చు.

బ్లూటూత్ ఆధారిత కమ్యూనికేషన్ టెక్నాలజీ

ఈ యాప్ బ్లూటూత్ లో ఎనర్జీ (BLE) నెట్‌వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది పక్కపక్కన ఉన్న ఫోన్ల మధ్య క్లస్టర్ రూపంలో కనెక్షన్ ఏర్పరచి, ఎన్‌క్రిప్ట్ చేయబడిన మెసేజ్‌లను పంపుతుంది. ఈ విధంగా, ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌కు సందేశాలు చేరతాయి. వినియోగదారుడు తన స్థానం మార్చినప్పటికీ, తన దగ్గర ఉన్న ఇతర ఫోన్లతో కనెక్ట్ అవుతూ క్లస్టర్‌ను కొనసాగిస్తూ ఉంటుంది. ఫలితంగా, బిట్‌చాట్‌ను ఉపయోగించేవారికి ఇంటర్నెట్ డౌన్, నెట్‌వర్క్ విఫలమైన సమయాల్లో కూడా మెసేజ్ పంపడం, స్వీకరించడం సాధ్యమవుతుంది.

సర్వర్ లేని మెసేజింగ్ ప్లాట్‌ఫాం

ఇది ఒక వికేంద్రీకృత (decentralized) యాప్ కావడంతో, ఏ కేంద్ర సర్వర్‌కు డేటా పంపబడదు. మీరు పంపే మెసేజ్‌లు కేవలం మీ ఫోన్, అందుకుంటున్న ఫోన్‌లో మాత్రమే స్టోర్ అవుతాయి. దాంతో మీ సమాచార భద్రత మరింత పెరుగుతుంది.

ప్రస్తుత పరిస్థితి

ప్రస్తుతం బిట్‌చాట్ iOS (iPhone) వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది పరీక్షా దశలో (Beta) కొనసాగుతోంది. Android యూజర్ల కోసం ఎప్పుడు విడుదలవుతుంది అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ ఫీచర్లను చూస్తే ఇది భవిష్యత్తులో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్స్‌కు గట్టి పోటీగా నిలవనుంది.

ఎక్కడ ఉపయోగకరంగా ఉంటుంది?

బిట్‌చాట్ యాప్ ప్రకృతి విపత్తులు, భూకంపాలు, తుఫానులు వంటి సందర్భాల్లో అత్యంత అవసరమైన టూల్‌గా నిలవనుంది. నెట్‌వర్క్ సర్వర్లు క్రాష్ అయినా కూడా బిట్‌చాట్ ఉపయోగించి లొకల్ కమ్యూనికేషన్ కొనసాగించవచ్చు.

San Reachel : వర్ణ వివక్షపై పోరాడిన మోడల్ రీచల్ ఆత్మహత్య

Exit mobile version