Card Chip Shortage: కార్డులు జారీ చేయలేకపోతున్నాం.. చిప్ ల కొరతపై సహకరించండి.. కేంద్ర సహాయం కోరిన బ్యాంకులు!!

రానున్న రోజుల్లో డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను బ్యాంకులు వెంటనే జారీ చేయకపోవచ్చు. 

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 09:00 PM IST

రానున్న రోజుల్లో డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను బ్యాంకులు వెంటనే జారీ చేయకపోవచ్చు.  ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ చిప్‌ ల కొరత నెలకొంది. ఫలితంగా డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడబోతుంది. చెల్లింపు కార్డుల వాణిజ్య సంస్థ , మొబైల్ చెల్లింపుల సంస్థలు సెమీ కండక్టర్ చిప్‌ల కొరతను నివారించడానికి, సరఫరా పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. ఇటీవల ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కూడా దీనిపై భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సెమీ కండక్టర్ చిప్‌ ల ఉత్పత్తి, పంపిణీ కంపెనీలు అనుసరిస్తున్న విధి విధానాలను సమీక్షించేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తో దర్యాప్తు చేయించాలని ఐబీఏ డిమాండ్ చేసింది. చిప్ ల కొరత కారణంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద కొత్తగా ఓపెన్ అవుతున్న కోట్లాది అకౌంట్ల వినియోగదారులకు రూపే డెబిట్ కార్డులు సకాలంలో జారీ చేయలేకపోతున్నామని తెలిపాయి. ఫలితంగా ఆ అకౌంట్ల వినియోగదారులు భీమా ప్రయోజనాలను సత్వరం పొందలేకపోతున్నారని పేర్కొన్నాయి.

కరోనా కారణంగా..

కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం సెమీ కండక్టర్  చిప్ ల తయారీ కంపెనీలు కార్యకలాపాలను పూర్తిగా మూసివేయవలసి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన చిప్స్‌ కొరత ఏర్పడింది. చిప్స్‌ కొరతతో పలు ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈఎంవీ చిప్స్‌ కొరతతో డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ఉత్తత్తికిభారం కానుంది. దీంతో భవిష్యత్తులో బ్యాంకుల నుంచి డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల జారీకి ఆటంకం ఏర్పడునుందని ట్రేడ్‌ యూనియన్‌ తెలిపింది. సో ప్రస్తుతం ఉన్న డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను జాగ్రత్తగా కాపాడుకోండి. ఎక్కడపడితే అక్కడే పొగ్గొట్టుకున్నారో ఇక అంతే సంగతులు.