Electric Vehicle Fire: మంటల ముప్పు ఈవీల్లో ఎక్కువా ? పెట్రోలు, డీజిల్ వాహనాల్లో ఎక్కువా ?

ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇటీవల మంటలు చెలరేగిన ఘటనలు కలవరపెడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - July 2, 2022 / 08:07 AM IST

ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇటీవల మంటలు చెలరేగిన ఘటనలు కలవరపెడుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలని భావించే వారి ఎదుట సవాలక్ష ప్రశ్నలను నిలుపుతున్నాయి. తాజాగా కొద్ది రోజుల క్రితం Tata Nexon EV లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది.ఈనేపథ్యంలో మంటలు రాచుకునే ముప్పు ఎలక్ట్రిక్ కార్లలో ఎక్కువా ? పెట్రోలు కార్లలో ఎక్కువా ? అనే దానిపై హాట్ డిబేట్ జరుగుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా వాహన ప్రమాద ఘటనల లెక్కలను పరిశీలిస్తే.. పెట్రోల్/డీజిల్ ఇంజిన్ల వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగిన ఘటనలు తక్కువని వెల్లడవుతోంది. వాహనాల ట్యాంక్ నుంచి పెట్రోల్, డీజిల్ లీకేజీ జరగడం వల్ల సాధారణంగా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణం.. దాని బ్యాటరీ ప్యాక్ అమరికలోని లోపాలే. బ్యాటరీ ప్యాక్ లోని రసాయనాల స్వభావం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటల తీవ్రత.. పెట్రోల్/డీజిల్ వాహనాల కంటే ఎక్కువగా ఉంటోంది. పెట్రోల్/డీజిల్ వాహనాల్లో ఇంధన లీకేజీని గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ ఫెయిల్యూర్ ను సకాలంలో గుర్తించే ఛాన్స్ తక్కువగా ఉంది. బ్యాటరీ ఫెయిల్యూర్ ను గుర్తించే ప్రక్రియ సాంకేతికమైంది కావడంతో ఎలక్ట్రిక్ వాహనదారులు సకాలంలో గుర్తించలేకపోతున్నారు. బ్యాటరీని పరిమితికి మించి ఛార్జింగ్ చేయడం.. వాహనం అతిగా వేడెక్కడం వంటి కారణాలతో ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు రేగుతుంటాయి.

ఆ కార్లలో మంటలు..

తాజాగా మన దేశంలో ఓ ప్రముఖ కంపెనీ ఎలక్ట్రిక్ కారులో మంటలు రాచుకోవడానికి కూడా ఇటువంటి కారణమే ఉండొచ్చని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ బ్యాటరీలు, సెల్స్ డిజైన్లో మార్పులు చేస్తే .. ఆ వాహనాల్లో ప్రమాదాలు చోటుచేసుకోకుండా నిలువరించవచ్చు. ఇక ముంబైలో నెక్సాన్ ఎలక్ట్రిక్ వాహనంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. వినియోగదారుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. దాదాపు నాలుగేళ్లలో ఇదే తొలి ఘటన అని స్పష్టం చేసింది.
ఇటీవల కాలంలో అమెరికాలో అనేక టెస్లా కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారత్ విషయానికి వస్తే ఓలా, ప్యూర్ ఈవీ సహా పలు కంపెనీల ద్విచక్ర వాహనాలు మంటల్లో కాలిపోయాయి. బ్యాటరీ నాణ్యత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రమాదానికి కారణం అని నిపుణులు చెబుతున్నారు. కాగా, పెట్రోల్, డీజీల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ క్రమంలో వాహనదారుల చూపు ఇంధనమే అవసరం లేని ఎలక్ట్రిక్ వాహనాలపైకి మళ్లింది.