Elon Musk Neuralink: మీరు మనసులో అనుకుంటే చాలు కంప్యూటర్ చేసేస్తుంది

మనిషి ఆలోచించడం ఆలస్యం దాన్ని కంప్యూటర్ ఆచరణలో పెట్టేస్తుంది. ఎలా అంటారా? మనిషి మెదడులో ఓ పరికరాన్ని ఇంప్లాంట్ చేస్తారు.

Published By: HashtagU Telugu Desk
Neuralink

మనిషి ఆలోచించడం ఆలస్యం దాన్ని కంప్యూటర్ ఆచరణలో పెట్టేస్తుంది. ఎలా అంటారా? మనిషి మెదడులో ఓ పరికరాన్ని (కాయిన్ పరిమాణంలో ఉండే) ఇంప్లాంట్ చేస్తారు. అది కంప్యూటర్ తో అనుసంధానమై ఉంటుంది. ఇక ఆ తర్వాత మెదడుకు, కంప్యూటర్ కు మధ్య లింక్ ఏర్పడుతుంది. దీంతో మనిషి ఆలోచనలు కంప్యూటర్ కు సంకేతాలుగా వెళతాయి. వాటికి అనుగుణంగా కంప్యూటర్ పనిచేస్తుంటుంది. టెస్లా అధినేత, ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్ కంపెనీ న్యూరాలింక్, వచ్చే ఆరు నెలల్లో దీన్ని ప్రయోగాత్మకంగా చేసి చూపించబోతోంది. ఈ విషయాన్ని మస్క్ స్వయంగా ప్రకటించారు.

‘‘యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అన్ని పత్రాలను సమర్పించాం. దాదాపు వచ్చే ఆరు నెలల్లో మొదటి న్యూరాలింక్ ను మనిషి మెదుడులో ప్రవేశపెడతాం. మొదటి మానవ ఇంప్లాంట్ ను సిద్ధం చేసేందుకు ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాం’’ అని మస్క్ కంపెనీ ప్రెజెంటేషన్ సందర్భంగా ప్రకటించారు. అంతే కాదు, త్వరలోనే తాను సైతం ఓ చిప్ ను తన మెదడులో ఇంప్లాంట్ చేయించుకోనున్నట్టు చెప్పారు.

న్యూరాలింక్ ఇంప్లాంట్లను ఇప్పటికే కొన్ని కోతుల మెదళ్లలో ప్రవేశపెట్టి పరీక్షించారు. అవి బేసిక్ వీడియో గేమ్ లను ప్లే చేయడం లేదా కర్సర్ ద్వారా స్క్రీన్ పై కదిలించడం చేశాయి. ‘‘ఇంప్లాంట్ ద్వారా మొదట ఎటువంటి చలనం లేని వారిలో కండరాల కదలికలను తీసుకురావాలని అనుకుంటున్నాం. ఇతరుల కంటే వేగంగా ఫోన్ ను ఆపరేట్ చేసేలా చేస్తాం. వినడానికి అద్భుతంగా అనిపించొచ్చు. కానీ వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్న వారిలోనూ పూర్తి స్థాయి శరీర కదలికలను తీసుకురాగలమని మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం’’అని మస్క్ ప్రకటించారు. నిజంగా మస్క్ చెబుతున్నవి నిజమే అయితే వైద్య రంగంలో గొప్ప ఆవిష్కరణగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

  Last Updated: 02 Dec 2022, 12:29 PM IST