AI – Fetus : అమ్మ గర్భంలో పెరిగే పిండం వయసును కచ్చితత్వంతో అంచనా వేసే కృత్రిమ మేధ (ఏఐ) మోడల్‌ను ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఐఐటీ మద్రాస్‌తో పాటు హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (టీహెచ్‌ఎస్‌టీఐ) పరిశోధకులు ఈ ఏఐ టెక్నాలజీని సంయుక్తంగా తయారు చేశాయి. మనదేశంలో ఈ తరహా ఏఐ మోడల్‌ను తయారుచేయడం ఇదే తొలిసారి. ఈ ఏఐ మోడల్‌కు ‘గర్భిణీ-జీఏ2’ అని పేరు పెట్టారు. జనన ఫలితాలపై అధునాతన ప్రయోగాల కోసం కేంద్ర బయోటెక్నాలజీ శాఖ(డీబీటీ) తీసుకొచ్చిన గర్భిణీ ప్రాజెక్టులో భాగంగా ఈ కృత్రిమమేధతో ఉన్న కొత్త మోడల్ ఆవిష్కరించారు.
We’re now on WhatsApp. Click to Join
గర్భిణుల సంరక్షణకు, ప్రసవ తేదీలను మరింత కచ్చితంగా నిర్ణయించడానికి సరైన గర్భధారణ వయసును (గెస్టేషనల్ ఏజ్) గుర్తించడం చాలా అవసరం. తద్వారా మాతా శిశు మరణాల ముప్పును తగ్గించవచ్చు. ‘గర్భిణీ-జీఏ2’ ఏఐ టెక్నాలజీని(AI – Fetus) మనదేశ జనాభా డేటా ప్రకారం డెవలప్ చేశారు. ఇది భారతీయ మహిళలు గర్భం దాల్చిన తర్వాత పిండం కచ్చితమైన వయసును గుర్తించేందుకు దోహదం చేస్తుంది. భారతీయ జనాభా, జననాలు, గర్భధారణ సమయాల్లో మార్పుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ సాంకేతికతను ఆవిష్కరించారు. తల్లి గర్భంలోని పిండం వయసు పక్కాగా తెలిస్తే.. గర్భిణికి సంబంధించిన కాన్పు తేదీని కచ్చితత్వంతో అంచనా వేయగలుగుతారు. ఇప్పటివరకు గర్భస్త పిండం వయసును గుర్తించే ప్రక్రియలో ఉన్న లోపాలను దాదాపు మూడు రెట్లు తగ్గించేలా ‘గర్భిణీ-జీఏ2’ ఏఐ టెక్నాలజీ ఉంటుందని చెబుతున్నారు.
Also Read : Drug Party : టాలీవుడ్ నిర్మాత, హీరోయిన్ చెల్లి, మాజీ సీఎం మనవడు.. రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్టులు
గర్భిణీ-GA2 ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేయడానికి అధునాతన డేటా సైన్స్‌తోపాటు కృత్రిమ మేధ పద్ధతులను పరిశోధకులు ఉపయోగించారు. ఈ పరిశోధనను గురుగ్రామ్ సివిల్ హాస్పిటల్, దిల్లీ సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, పుదుచ్చేరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భాగస్వామ్యంతో సక్సెస్ ఫుల్‌గా నిర్వహించారు. దీనికి సంబంధించిన పరిశోధన వివరాలు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పీర్-రివ్యూడ్ జర్నల్ ‘లాన్సెట్’లో ప్రచురితమయ్యాయి.