AI Snake Trapper : ప్రపంచంలో పాముకాటు మరణాలు అత్యధికంగా సంభవిస్తున్న దేశం ఏదో తెలుసా .. భారత్ !! ప్రతి సంవత్సరం మన దేశంలో 30 లక్షల మంది పాముకాటు బారిన పడుతుంటే, వారిలో దాదాపు 50వేల మంది చనిపోతున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. ఇదేే విధంగా ఒక రైతు తన కళ్లెదుటే, పొలం గట్టుపై పాము కాటుతో చనిపోవడాన్ని చూసి కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ నీలు జ్యోతి అహూజా చలించిపోయారు. ఇలాంటి పాముకాట్ల నుంచి ప్రజలను కాపాడే లక్ష్యంతో ఆమె ‘ఏఐ స్నేక్ ట్రాపర్’ను రూపొందించారు.
Also Read :Trump Vs Buffet: ట్రంప్ దెబ్బకు మార్కెట్లు డౌన్.. బఫెట్ సంపద అప్.. ఎలా ?
ప్రాణ నష్టానికి టెక్నాలజీతో అడ్డుకట్ట
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్) ఉంది. దానిలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్‌గా, అసోసియేట్ డీన్‌గా నీలు జ్యోతి వ్యవహరిస్తున్నారు. రీసెర్చ్ వర్క్ కోసం ఒక గ్రామానికి ఆమె వెళ్లగా.. ఓ రైతు పాము కాటుతో చనిపోవడాన్ని చూసి నీలు బాధపడ్డారు. సంప్రదాయ పద్ధతుల్లో పాములను పట్టే వారు కూడా ఎంతోమంది చనిపోతున్నారని ఆమె తన అధ్యయనంలో గుర్తించారు. ఈ ప్రాణ నష్టానికి టెక్నాలజీతో అడ్డుకట్ట వేయాలని నీలు సంకల్పించారు.
Also Read :Anti Aging Treatments: యాంటీ ఏజింగ్ చికిత్సలు, ఖర్చులు.. లేటెస్ట్ ట్రెండ్‌పై ఓ లుక్
ఏఐ ట్రాపర్.. పామును ఇలా పట్టేస్తుంది
మెషీన్ లెర్నింగ్ ఏఐ టెక్నాలజీ, కంప్యూటర్ విజన్‌తో పాములను(AI Snake Trapper) గుర్తించి బంధించే పరికరాన్ని నీలుజ్యోతి రూపొందించారు. ఈ పరికరాన్ని కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నిపుణుల కమిటీ ఎదుట ఆమె ప్రదర్శించారు. దాన్ని చూసి, వారు 2023 సంవత్సరంలో రీసెర్చ్ సపోర్ట్ నిధులను మంజూరు చేశారు. ఆ నిధులతోనే పూర్తిస్థాయి ఏఐ ఆధారిత స్నేక్ ట్రాపర్‌ను నీలు తయారు చేశారు. ఇది మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌తో పనిచేస్తుంది. ఈ ట్రాపర్ లోపల ఒక కృత్రిమ ఆహారం ఉంచుతారు. దానిపై ఒక రసాయన పదార్థాన్ని చల్లుతారు. దాని వాసన పాములను తన వైపుగా ఆకర్షిస్తుంది. ఈ పరికరానికి నాలుగువైపులా అమర్చిన పైపులలో నుంచి పాము లోపలికి వెళ్తుంది. అయితే అది ఇక బయటకు రాలేదు. ఈ పరికరంలోపల ఒక కెమెరా ఉంటుంది. అది పాము ఫొటోను తీసి, సమీపంలో ఉన్నవారికి అలర్ట్ పంపుతుంది. అలా పాములు పట్టి నివాసాలకు దూరంగా సురక్షిత ప్రాంతాలకు వాటిని తరలించొచ్చు. ఈ పాములు పట్టే ఏఐ పరికరం బ్యాటరీ, సోలార్ పవర్ రెండింటితోనూ పనిచేయగలదు.