Grok Vs Telugu Words : గ్రోక్.. ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్)లో అందుబాటులో ఉన్న ఏఐ టూల్. దీన్ని చాలామంది వినియోగిస్తున్నారు. ఛాట్ జీపీటీకి పోటీగా గ్రోక్‌ను తీసుకొచ్చారు. ఎక్స్‌ను వినియోగిస్తున్న పలువురు తెలుగు యువత అడిగిన ప్రశ్నలకు గ్రోక్ విచిత్రమైన సమాధానాలు చెప్పింది. కొందరు తెలుగు యువత గ్రోక్‌ను అసభ్యకర భాషలో విచిత్రమైన ప్రశ్నలు అడిగారు. దీంతో ఆశ్చర్యకరంగా గ్రోక్ కూడా అదే విధమైన శైలిలో వారికి సమాధానాలు ఇచ్చింది. ప్రశ్నలు అడిగేందుకు తెలుగు యువత ఉపయోగించిన పదాలనే.. గ్రోక్ తిరిగి ఉపయోగిస్తూ హాస్యభరితమైన ఆన్సర్స్ ఇవ్వడం విశేషం. వీటిని చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వాళ్లు మరిన్ని క్రియేటివ్ ప్రశ్నలు అడుగుతూ.. గ్రోక్ నుంచి సమాధానాలు పొందుతున్నారు.
Also Read :CM Revanth : బీజేపీ ఎంపీ అరుణకు సీఎం రేవంత్ ఫోన్.. వివరాలివీ
అచ్చం మనిషిలా ఆన్సర్లు
గ్రోక్ ఏఐ(Grok Vs Telugu Words) వినియోగిస్తున్న భాష, పదజాలాలను చూస్తుంటే.. అది AI టూల్ మాత్రమే కాదని, అవతలి వైపు నుంచి ఎవరో మనిషే సమాధానం ఇస్తున్నట్లుగా అనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. గ్రోక్ తమకు ఇచ్చిన సమాధానాల స్క్రీన్ షాట్లను తీసి పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఏదైనా ప్రశ్నకు తప్పుడు సమాధానం ఇచ్చిన సందర్భంలో.. దాన్ని ఎత్తి చూపితే అది వెంటనే సరిదిద్దుకుంటోంది. ఇక గ్రోక్ ఇస్తున్న ఆన్సర్ల గురించి అనేక మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకించి భారత రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే.. గ్రోక్ ఏఐ ఇస్తున్న సమాధానాలు అవాక్కయ్యేలా ఉంటున్నాయి. వీటిని కొందరు తప్పుపడుతుండగా.. ఇంకొందరు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోనవసరం లేదని వాదిస్తున్నారు.
Also Read :Sunita Williams Salary: 9 నెలలుగా స్పేస్‌లోనే సునిత.. ఎక్స్‌ట్రా శాలరీ ఎంత ?
బుల్లిరాజు ‘గ్రోక్’
చాలామంది తెలుగు నెటిజన్లు గ్రోక్‌ను ‘బుల్లి రాజు’ అని పిలుస్తున్నారు. ఇటీవలే విడుదలైన తెలుగు సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’లోని ఒక పాత్ర పేరు ‘బుల్లి రాజు’. అచ్చం ఆ పాత్రలాగే గ్రోక్ ప్రవర్తన ఉందని అంటున్నారు. బుల్లి రాజు పాత్రలో బాల నటుడు రేవంత్ నటించారు. ‘‘ఎలాగైనా సరే గ్రోక్‌ను దాని యజమాని ఎలాన్ మస్క్ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే అది బూతు పదాలను నేర్చుకుంటోంది’’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు.