ఆధార్ కార్డు (Aadhar Card) యూజర్లకు శుభవార్త. ఇకపై ఆధార్ కార్డు వివరాల్లో మార్పులు చేయడానికి సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మొబైల్ ద్వారానే మార్పులు చేసుకునే సౌకర్యం కలగనుంది. యూఐడీఏఐ త్వరలోనే కొత్తగా అభివృద్ధి చేస్తున్న ‘ఈ-ఆధార్ యాప్’లో ఏఐ, ఫేస్ ఐడీ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను యూజర్లు స్వయంగా తమ మొబైల్‌లోనే అప్డేట్ చేసుకోవచ్చు.
September 2025 Bank Holidays: సెప్టెంబర్ నెలలో ఏకంగా 15 రోజుల వరకు బ్యాంకులకు సెలవులు
ప్రస్తుతం ఆధార్ వివరాల్లో మార్పులు చేయాలంటే యూజర్లు నమోదు కేంద్రాలకు వెళ్లి క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. గ్రామీణ, దూరప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇది మరింత కష్టతరం అవుతోంది. ఈ సమస్యలకు పరిష్కారం చూపడానికి యూఐడీఏఐ కొత్త యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది. అయితే వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాల్లో మార్పులు చేయాలంటే మాత్రం కచ్చితంగా ఆధార్ సెంటర్లను సందర్శించాల్సిందే. అంతేకాకుండా బయోమెట్రిక్ అప్డేట్ గడువును 2025 నవంబర్ వరకు పొడిగించారు.
కొత్త ‘ఈ-ఆధార్ యాప్’ ప్రారంభమైతే యూజర్లకు మరింత భద్రతతో పాటు సౌకర్యం కూడా లభిస్తుంది. ఇప్పటి వరకు పాస్‌వర్డ్, ఓటీపీ లాంటి పద్ధతులను ఉపయోగించాల్సి వచ్చేది. కానీ త్వరలో ఫేస్ ఐడీ ద్వారా నేరుగా లాగిన్ అయి, వివరాలను వేగంగా అప్డేట్ చేసుకోవచ్చు. యూజర్లు సమర్పించే సమాచారం సరిగా ఉందో లేదో యాప్ ఆటోమేటిక్‌గా క్రాస్ వెరిఫికేషన్ చేస్తుంది. దీంతో వ్యక్తిగత డేటా చోరీలు, మోసాలకు అవకాశం తగ్గుతుంది. ఈ సరికొత్త యాప్ రావడంతో ఆధార్ అప్డేట్ ప్రక్రియ సులభం, వేగవంతం, సురక్షితం కానుంది.