Site icon HashtagU Telugu

ICC Cricket World Cup Qualifier 2023: విండీస్‌కు జింబాబ్వే షాక్‌

ICC Cricket World Cup Qualifier 2023

Whatsapp Image 2023 06 24 At 11.38.54 Pm

ICC Cricket World Cup Qualifier 2023: వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫైయింగ్ టోర్నీలో వెస్టిండీస్‌కు షాక్ తగిలింది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన కరేబియన్ టీమ్‌ తాజాగా జింబాబ్వే చేతిలో మట్టికరిచింది. పెద్దగా అంచనాలు లేని జింబాబ్వే 35 పరుగుల తేడాతో విండీస్‌పై సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకు ఓపెనర్లు గుంబీ, ఎర్విన్ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. తర్వాత వరుస వికెట్లు చేజార్చుకున్నప్పటకీ సికిందర్ రాజా, ర్యాన్ బర్ల్‌ ఆదుకోవడంతో జింబాబ్వే కోలుకుంది. వీరిద్దరూ హాఫ్ సెంచరీతో రాణించారు. ఐదో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. చివర్లో లోయర్ ఆర్డర్‌ నిరాశపరచడంతో 49.5 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సికిందర్ రాజా 68 , బర్ల్‌ 50 పరుగులు చేయగా…విండీస్ బౌలర్లలో కీమో పాల్ 3 , అల్జరీ జోసెఫ్, అకిల్ హొస్సేన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

269 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 6.3 ఓవర్లలో 43 పరుగులు జోడించారు. బ్రెండన్ కింగ్ 20 , కైల్ మేయర్స్ 56 పరుగులతో రాణించారు. తర్వాత షై హోర్, పూరన్, ఛేజ్ రాణించినా కీలక భాగస్వామ్యాలను నెలకొల్పలేకపోయారు. జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల కోసం విండీస్ బ్యాటర్లు శ్రమించాల్సి వచ్చింది. ఛేజ్ 44 , పూరన్ 34, హోప్ 30 పరుగులు చేశారు. చివర్లో జాసన్ హోల్డర్ పోరాడినా ఫలితం లేకపోయింది. విండీస్‌ 44.4 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. సికిందర్ రాజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సరైన పార్టనర్‌షిప్స్ నెలకొల్పడంలో విండీస్ విఫలమైంది. ఈ విజయంతో జింబాబ్వే సూపర్ 6 రౌండ్‌కు అర్హత సాధించింది. అటు విండీస్ కూడా సూపర్ 6 రౌండ్‌కు చేరువైంది. ఇప్పటికే కరేబియన్ టీం అమెరికా, నేపాల్ జట్లపై విజయం సాధించింది. తన చివరి మ్యాచ్‌లో విండీస్ నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.

Read More: Dhyanam : ధ్యానం రోజూ చేయడం వలన కలిగే ప్రయోజనాలు..