WC Qualifier: వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ టోర్నీలో సంచలనాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వెస్టిండీస్ పసికూన చేతిలో ఓడి ఇంటిదారి పడితే..తాజాగా జింబాబ్వే కూడా నిష్క్రమించింది. తొలి రౌండ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన జింజాబ్వే సూపర్ 6 స్టేజ్‌లో మాత్రం నిరాశపరిచింది.
ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి ప్రపంచకప్‌కు అర్హత సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. తక్కువ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 31 పరుగుల తేడాతో ఆ జట్టును ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. మైకెల్ లీస్క్ 48, మాథ్యూ క్రాస్ 38, బ్రాండన్ మెక్‌ముల్లన్ 34, మున్సే 31, మార్క్ వాట్ 21 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ మూడు వికెట్లు తీయగా.. చటారా రెండు, నగరవా ఒక వికెట్ పడగొట్టాడు.
భారీ టార్గెట్ కాకున్నా జింబాబ్వే ఆరంభం నుంచే తడబడింది. కేవలం 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తర్వాత రియాన్ బర్ల్, వెస్లీ పోరాడడంతో కోలుకున్నట్టు కనిపించింది. అంచనాలు పెట్టుకున్న సికిందర్ రాజా, సీన్ విలియమ్స్ విఫలమవడం జింబాబ్వే కొంపముంచింది. దీంతో ఆ జట్టు 41.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది. 84 బంతుల్లో 83 పరుగులు చేసిన రియాన్ బర్ల్ వీరోచిత పోరాటం వృథాగా మిగిలింది.
స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ సోల్ మూడు వికెట్లు తీయగా, బ్రాండన్ మెక్‌ముల్లన్ రెండు, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, క్రిస్ గ్రీవ్స్ తలా ఒక వికెట్ తీశారు. తొలి మ్యాచ్‌లో ఓడినా వరుసగా రెండు విజయాలతో ప్లస్ రన్‌రేట్‌తో ఉన్న స్కాట్లాండ్ ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. దీంతో ఆ జట్టుకు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అవకాశాలున్నాయి. స్కాట్లాండ్ తమ చివరి మ్యాచ్ నెదర్లాండ్స్‌పై నేరుగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడినా స్కాట్లాండ్‌కు అవకాశం ఉంటుంది. కాకపోతే నెదర్లాండ్స్ చేతిలో భారీ ఓటమి పాలవ్వకుండా ఉండాలి. ప్రస్తుతం డచ్ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. స్కాట్లాండ్‌ను ఓడించినా ఆ జట్టు ఆరు పాయింట్లకు చేరుకుంటుంది. అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది. మొత్తం మీద నెదర్లాండ్స్, స్కాట్లాండ్ చివరి బెర్త్ కోసం రేసులో నిలిచాయి.