Site icon HashtagU Telugu

Zimbabwe Record: ఆసీస్‌పై జింబాబ్వే సంచలన విజయం

Zimbambway

Zimbambway

సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. జింబాబ్వే జట్టు చివరి వన్డేలో కంగారూలపై సంచలన విజయం సాధించింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆసీస్‌పై గెలిచింది. తొలి రెండు వన్డేల్లో ఘోరపరాజయం పాలైన జింబాబ్వే మూడో వన్డేలో మాత్రం అదరగొట్టింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా వన్డే సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లిన జింబాబ్వే సిరీస్‌ను కోల్పోయినప్పటకీ… చివరి మ్యాచ్‌లో గెలిచి క్లీన్‌స్వీప్‌ తప్పించుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను ఆరంభం నుంచే జింబాబ్వే బౌలర్లు కంగారెత్తించారు. 31 ఓవరప్లలో 141 పరుగులకే ఆసీస్ కుప్పకూలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 94 పరుగులతో రాణించకుంటే ఇంతకన్నా తక్కువ స్కోర్‌కే కంగారూ టీమ్ ఆలౌటయ్యేది.

మిగిలిన బ్యాటర్లలో మాక్స్‌వెల్ 19 పరుగులు చేయగా… 9 మంది సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. జింబాబ్వే ర్యాన్ బర్ల్ అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 3 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. 141 పరుగుల ఛేజింగ్‌లో జింబాబ్వేకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. అయితే తొలి పవర్ ప్లే తర్వాత ఆ జట్టు కూడా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ చకబావ 37 రన్స్‌తో జట్టును గెలిపించాడు. దీంతో 39 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ గడ్డపై జింబాబ్వేకు ఇదే తొలి విజయం. ఈ విజయం తమ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని జింబాబ్వే కెప్టెన్ చకబావా వ్యాఖ్యానించాడు. అటు ఆసీస్ కెప్టెన్ ఫించ్ కూడా జింబాబ్వే ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు.