Zampa: ఆసీస్ స్పిన్నర్ కు కోవిడ్‌ పాజిటివ్

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌ చేతుల్లో దారుణంగా ఓడిన డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఆస్ట్రేలియాకు శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు మరో షాక్ తగిలింది.

  • Written By:
  • Publish Date - October 25, 2022 / 05:26 PM IST

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌ చేతుల్లో దారుణంగా ఓడిన డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఆస్ట్రేలియాకు శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు మరో షాక్ తగిలింది. ఆ టీమ్ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా కోవిడ్‌ బారిన పడ్డాడు. దీంతో ఈ మ్యాచ్ కు అతను దూరమయ్యాడు. నిబంధనల ప్రకారం.. కొవిడ్‌ సోకిన ప్లేయర్‌ను కూడా బరిలోకి దింపడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆసీస్ మాత్రం జంపాను ఆడించ లేదు. ఇంతకు ముందు శ్రీలంకతో మ్యాచ్‌లో ఐర్లాండ్ ప్లేయర్‌ జార్జ్‌ డాక్రెల్‌ కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినా తుది జట్టులో ఉన్నాడు. జంపా కూడా కొవిడ్‌ బారిన పడినా.. అతనికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా వెల్లడించింది.

అయితే అనారోగ్యం కారణంగా జంపా మ్యాచ్ లో ఆడడం లేదని టాస్ సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ చెప్పాడు. ఇది ఒక విధంగా ఆసీస్ కు ఎదురు దెబ్బగానే చెప్పాలి. గతేడాది జంపా 13 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు
ఈ వరల్డ్‌కప్‌లో నిలవాలంటే ఇకపై ప్రతీ మ్యాచ్ ఆసీస్ కు కీలకం. దీనికి తోడు న్యూజిలాండ్‌ చేతిలో ఏకంగా 89 రన్స్‌ తేడాతో ఓడిన ఆసీస్.. నెట్‌ రన్‌రేట్‌ కూడా దారుణంగా ఉంది. దీంతో శ్రీలంకతో మ్యాచ్‌ ను భారీ తేడాతో గెలుపొంది రన్ రేట్ మెరుగు పరుచుకోవాలని ఆ జట్టు భావిస్తోంది .