Yuzvendra Chahal 350 T20 Wickets : టీ20ల్లో చాహ‌ల్ అరుదైన ఘ‌న‌త‌.. టీమ్ఇండియా క్రికెట‌ర్ల‌లో ఒకే ఒక్క‌డు

టీమ్ ఇండియా స్పిన్న‌ర్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కీల‌క ఆట‌గాడు యుజ్వేంద్ర చాహ‌ల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

  • Written By:
  • Publish Date - May 8, 2024 / 10:49 AM IST

Yuzvendra Chahal 350 T20 Wickets : టీమ్ ఇండియా స్పిన్న‌ర్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కీల‌క ఆట‌గాడు యుజ్వేంద్ర చాహ‌ల్ (Yuzvendra Chahal) అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ20 క్రికెట్‌లో (అంత‌ర్జాతీయ‌, లీగ్‌లు) 350 వికెట్లు ప‌డగొట్టిన తొలి భార‌త బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. మంగ‌ళ‌వారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చాహ‌ల్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.

ఢిల్లీతో మ్యాచ్‌లో రిష‌బ్ పంత్‌ను ఔట్ చేయ‌డం ద్వారా చాహ‌ల్ టీ20 క్రికెట్‌లో 350 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. అత‌డు 301 మ్యాచుల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇక ఓవ‌రాల్‌గా చూసుకుంటే 11వ ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు.

టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా వెస్టిండీస్ బౌల‌ర్ డ్వేన్ బ్రావో ఉన్నాడు. 574 మ్యాచుల్లో 625 వికెట్లు తీశాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా ర‌షీద్‌ఖాన్‌, సునీల్ న‌రైన్, ఇమ్రాన్ తాహిర్, షకీబ్ అల్ హసన్, ఆండ్రీ రస్సెల్, వహాబ్ రియాజ్, లసిత్ మలింగ, సోహైల్ తన్వీర్, క్రిస్ జోర్డాన్ లు ఉన్నారు.

భార‌త బౌల‌ర్ల విష‌యానికి వ‌స్తే.. చాహ‌ల్ త‌రువాత పియూష్ చావ్లా, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌లు ఉన్నారు. వీరిద్ద‌రూ వ‌రుస‌గా 310, 306 వికెట్లను ప‌డ‌గొట్టారు.

టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాళ్లు..

డ్వేన్ బ్రావో – 625 వికెట్లు
ర‌షీద్‌ఖాన్ – 572
సునీల్ న‌రైన్ – 549
ఇమ్రాన్ తాహిర్ – 502
షకీబ్ అల్ హసన్ – 482
ఆండ్రీ రస్సెల్ – 443
వహాబ్ రియాజ్- 413
లసిత్ మలింగ – 390
సోహైల్ తన్వీర్ – 389
క్రిస్ జోర్డాన్ – 368
యుజ్వేంద్ర చాహ‌ల్ – 350

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(50; 20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), అభిషేక్ పోరెల్(65; 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు ) రాణించ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 221 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 201 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స‌ర్లతో 84 ప‌రుగులు చేసిన‌ప్ప‌టికీ మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో 20 ప‌రుగుల తేడాతో ఓట‌మి త‌ప్ప‌లేదు.

Also read : Pak Pacer: పాక్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌.. స్టార్ ఆట‌గాడికి వీసా స‌మ‌స్య‌..!