Site icon HashtagU Telugu

Yuvi To Kohli: కోహ్లీ కి యూవీ స్పెషల్ గిఫ్ట్

Youvraj Kohli Imresizer

Youvraj Kohli Imresizer

టీమ్ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ స్పెషల్ గిఫ్ట్ ను పంపించాడు. గోల్డెన్‌షూస్‌ను కానుకగా పంపిస్తూ దాంతో పాటుగా ఓ భావోద్వేగ లేఖ కూడా రాశాడు. కోహ్లీ, యువరాజ్ సింగ్ ఇద్దరూ కలిసి కొన్నేళ్లపాటు టీమిండియా తరఫున ఆడారు. అంతేగాక ప్యూమా కంపెనీకి కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు.ఈ నేపథ్యంలో ప్యూమా కంపెనీకి చెందిన గోల్డెన్ షూస్‌ను విరాట్ కోహ్లికి కానుకగా పంపిన యువరాజ్ సింగ్ ఓ లేఖ రాశాడు.

విరాట్ కోహ్లీ.. నువ్వు ప్రపంచానికి ఒక సూపర్ స్టార్ కావచ్చు.. కానీ నాకు మాత్రం ఎప్పుడూ నా ప్రియమిత్రునివే.. నువ్వు ఒక దిగ్గజ క్రికెటర్ గా గొప్ప వ్యక్తిగా ఎదగడం నేను కళ్లారా చూశాను. ఆటపట్ల నీ నిబద్దత, మైదానంలో గెలుపు కోసం నీ ఆరాటం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. నిన్ను నువ్వు రాటుదేల్చుకుంటూ ప్రపంచంలోనే దిగ్గజ క్రికెటర్ గా ఎదిగిన తీరు అసామాన్యం.. ఈ అద్భుతమైన ఆటతీరుతో ఎన్నో రికార్డుల్ని సాధించావు. అలాగే టీమిండియాకు గొప్ప సారథివి అనిపించుకున్నావు.

మన మధ్య ఉన్న ఈ బంధం జీవితాంతం ఇలాగే కొనసాగాలి.
నీలోని దూకుడుతనం ఎప్పటికీ అలానే ఉండాలి. నీ నుంచి మరెన్నో అసాధారణ ఇన్నింగ్స్ లు బయటికి రావాలి.. నువ్వు ఒక సూపర్ స్టార్. నీకోసమే ఈ స్పెషల్ గోల్డెన్ షూ.. అంటూ యువరాజ్ భావోద్వేగపూరిత లేఖను రాశాడు. ప్రస్తుతం యూవీ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవలే టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
కోహ్లీ తన కెరీర్ లో ఇప్పటివరకు 99 టెస్టులు, 260 వన్డేలు, 97 టీ ట్వంటీలు ఆడాడు. లంకతో టీ ట్వంటీ సీరీస్ నుండి తప్పుకున్న కోహ్లీ టెస్ట్ సీరీస్ ఆడనున్నాడు.

Exit mobile version