Site icon HashtagU Telugu

Yuvraj Singh: యువరాజ్ సింగ్ రీ ఎంట్రీ, జట్టు నిండా విధ్వంసకారులే

Yuvraj Singh

Yuvraj Singh

టీమిండియా సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన యువీ ఆ తర్వాత కొన్ని లీగ్‌ల్లో పాల్గొన్నాడు. అయితే అభిమానుల కోరిక మేరకు యువరాజ్ మరోసారి బ్యాట్ పట్టబోతున్నాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌ ద్వారా ఈ తరం క్రికెట్ అభిమానులకు యువరాజ్ సింగ్ బ్యాటింగ్ పవర్ చూసే అవకాశం దక్కుతుంది. ఎందుకంటే యువీ గొప్పతనం గురించి నైంటీస్ కిడ్స్ కి మాత్రమే తెలిసి ఉంటుంది.

యువీ పేరు చెబితే ఎవరికైనా 2007 టీ20 ప్రపంచకప్‌ కచ్చితంగా గుర్తొస్తుంది. ఇంగ్లాండ్‌పై యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది టి20 క్రికెట్ కి ల్యాండ్ మార్క్ సెట్ చేశాడు. ఆ ఇన్నింగ్స్ తో యువరాజ్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎంత కోపం ఉన్నా మైదానంలో చూపించకుండా బ్యాట్ తోనే సమాధానం చెప్పే ఆ అట్టిట్యూడ్ అంటే ఫ్యాన్స్ కు కూడా చాలా ఇష్టం. ఆ ఏడాది టి20 ప్రపంచకప్ భారత్ గెలవడంలో యువరాజ్ దే కీ రోల్. 2011 వన్డే ప్రపంచ కప్ గెలవడంలోనూ యువరాజ్ కీలక పాత్ర పోషించాడు.ఇప్పుడు యువరాజ్ మరోసారి బ్యాట్ పట్టుకోనుండటంతో అభిమానుల ఆనందానికి అవుదుల్లేకుండా పోయింది. సోషల్ మీడియా వేదికగా యువీకి ఘనంగా వెల్కమ్ చెప్తున్నారు.

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో భాగంగా ఇండియా మాస్టర్స్ జట్టు తరపున యువరాజ్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. ఈ లీగ్ ఫిబ్రవరి 22 నుండి మార్చి 16 వరకు జరుగుతుంది. యువరాజ్ సింగ్ తో పాటు, దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్ మాన్ జెపి డుమిని కూడా ఈ లీగ్ లో పాల్గొంటాడు. అతను దక్షిణాఫ్రికా మాస్టర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. శ్రీలంక మాజీ బ్యాట్స్‌మన్ ఉపుల్ తరంగ కూడా శ్రీలంక మాస్టర్స్ తరపున ఈ లీగ్‌లో కనిపించబోతున్నాడు. ఇండియా మాస్టర్స్ జట్టులో యువీతో పాటు జట్టులో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. శ్రీలంకకు చెందిన కుమార్ సంగక్కర, వెస్టిండీస్‌కు చెందిన బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కాలిస్, ఇంగ్లాండ్‌కు చెందిన ఇయాన్ మోర్గాన్ కూడా ఈ లీగ్లో పాల్గొంటారు. ఇండియా మాస్టర్ లీగ్ మూడు వేర్వేరు నగరాల్లో జరుగుతుంది. ఈ లీగ్ మ్యాచ్‌లు నావీ ముంబై, రాజ్‌కోట్ మరియు రాయ్‌పూర్‌లలో జరుగుతాయి.