Younis Khan: ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుండి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే అఫ్గానిస్థాన్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఆఫ్ఘన్ తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననుంది. అంతేకాదు అఫ్గానిస్థాన్ పాల్గొన్న ఐసీసీ టోర్నీలన్నింటిలోనూ సత్తా చాటుతూ వచ్చింది. గత వన్డే ప్రపంచకప్ లో ఇంగ్లండ్, పాకిస్తాన్ మరియు శ్రీలంక లాంటి బలమైన జట్లను ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే బలమైన జట్లలో ఆఫ్ఘనిస్తాన్ ఒకటిగా పరిగణించబడటానికి ఇదే కారణం.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్‌ను (Younis Khan) ఆఫ్ఘనిస్థాన్ మెంటార్‌గా నియమించింది. యూనిస్ 2022లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ కోచ్‌గా కూడా వ్యవహరించాడు. అఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధి సయ్యద్ నసీమ్ సాదత్ మాట్లాడుతూ.. ‘ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ మెంటార్‌గా పాకిస్థాన్ మాజీ ఆటగాడు యూనిస్ ఖాన్‌ను ఏసీబీ నియమించింది. పాక్‌లో టోర్నీ ప్రారంభానికి ముందే యూనిస్ ఖాన్ జట్టులో చేరనున్నన్నట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజాలలో యూనిస్ ఖాన్ ఒకరు. అతను 118 టెస్టుల్లో 10,099 పరుగులు చేశాడు, అతని అత్యుత్తమ స్కోరు 313 పరుగులు. 2009లో టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. యూనిస్‌కు అపారమైన కోచింగ్ అనుభవం ఉంది. అతను పాక్ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ పాత్రను పోషించాడు, ఇదికాక అతను పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ మరియు అబుదాబి టి10 లీగ్‌లో బంగ్లా టైగర్స్‌తో కలిసి పనిచేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ విజయాలు సాధించడంలో యూనిస్ ఖాన్ సహాయపడతాడని అంతా భావిస్తున్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-బిలో చేర్చబడింది. ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలను ఆఫ్ఘనిస్థాన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 21న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 26న ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఆఫ్ఘనిస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్‌ని ఫిబ్రవరి 28న ఆస్ట్రేలియాతో ఆడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆఫ్ఘనిస్థాన్ లీగ్ మ్యాచ్‌లు
- 21 ఫిబ్రవరి – ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా
- 26 ఫిబ్రవరి – ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్
- ఫిబ్రవరి 28 – ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా