IND vs ENG: రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టుబిగించింది. బౌలర్ల జోరుకు జైస్వాల్ విధ్వంసకర సెంచరీ తోడవడంతో ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్ ను శాసించే స్థితిలో నిలిచింది. మూడో రోజు లంచ్ వరకూ ఇంగ్లాండ్ నిలకడగా ఆడడంతో కాసేపు టెన్షన్ నెలకొంది. అయితే లంచ్ తర్వాత భారత బౌలర్లు చెలరేగారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ జోరుకు అడ్డుకట్ట వేశారు. కేవలం 29 పరుగుల వ్యవధిలోనే మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో 319 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆలౌట్ కాగా.. టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం లభించింది. సిరాజ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. కుల్దీప్ యాదవ్ రెండు, జడేజా రెండు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.
తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు ఆశించిన ఆరంభాన్ని ఇవ్వలేక పోయారు. రోహిత్ త్వరగానే ఔట్ అవగా…జైస్వాల్ , గిల్ జట్టును ఆదుకున్నారు. రెండో వికెట్ కు 161 రన్స్ జోడించారు. ఈ క్రమంలో జైస్వాల్ సెంచరీ సాధించాడు. ఈ సీరీస్ లో అతనికి ఇది రెండో శతకం. ఓవరాల్ గా టెస్ట్ కెరీర్ లో మూడోది. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన ఈ యువ ఓపెనర్ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. కొన్ని రివర్స్ స్వీప్‍లతో ఇంగ్లిష్ స్పిన్నర్లకు చుక్కలు చూపాడు. 80 బంతుల్లో అర్ధ శకతం చేసిన యశస్వి జైస్వాల్.. చివరి 75 పరుగులను కేవలం 49 బంతుల్లోనే చేశాడు జైస్వాల్. అటు గిల్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. సెంచరీ తర్వాత జైస్వాల్ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‍కు వెళ్లాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లకు 196 రన్స్ చేసింది. ప్రస్తుతం 322 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా నాలుగో రోజు దూకుడుగా ఆడి డిక్లేర్ చేసే అవకాశం ఉంది.
Also Read: Kothagudem: కొత్తగూడెంలో ఐదుగురు నక్సల్స్ అరెస్ట్