Site icon HashtagU Telugu

Venkatesh Prasad: మాజీ పేసర్ ఘాటు వ్యాఖ్యలు

Virat Kohli

Virat Kohli

భారత క్రికెట్‌లో రికార్డులకు రారాజుగా నిలిచి పరుగుల యంత్రంగా పిలిపించికున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఐపీఎల్‌లోనూ పెద్దగా ప్రభావం చూపని విరాట్ తాజాగా ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ విఫలమయ్యాడు. దీంతో అతన్ని టీ ట్వంటీ జట్టు నుంచి తప్పించాలన్న విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ఇప్పటికే కపిల్‌దేవ్‌ చేసిన వ్యాఖ్యలకు మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ మద్ధతు పలికాడు. ఫామ్‌లో లేని కోహ్లిని టీమ్‌లోకి ఎందుకు ఎంపిక చేయడం అని ప్రశ్నించిన కపిల్‌ దేవ్‌ అభిప్రాయంతో అతడు ఏకీభవించాడు. ఒకప్పుడు గంగూలీ, జహీర్‌ఖాన్‌, సెహ్వాగ్‌, హర్భజన్‌లాంటి ప్లేయర్స్‌ను కూడా ఫామ్‌లో లేనప్పుడు పక్కన పెట్టిన విషయాన్ని ప్రసాద్‌ తన ట్వీట్‌లో గుర్తు చేశాడు.

ఒకప్పుడు ఫామ్‌లో లేకపోతే పేరుప్రతిష్టలతో సంబంధం లేకుండా పక్కన పెట్టేవారనీ, సౌరవ్‌, సెహ్వాగ్‌, యువరాజ్‌, జహీర్‌, భజ్జీలాంటి వాళ్లను ఫామ్‌లో లేనప్పుడు తీసేసారన్నాడు. వాళ్లు దేశవాళీ క్రికెట్‌ ఆడి రన్స్‌ చేసి మళ్ళీ తిరిగి వచ్చారన్నాడు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందనీ, ఫామ్‌లో లేని వాళ్లకు రెస్ట్‌ ఇస్తున్నారని వెంకటేశ్ ప్రసాద్ విమర్శించాడు.

రెస్ట్ ఇవ్వడం వల్ల వాళ్లు ఫామ్‌లోకి ఎలా వస్తారని ప్రశ్నించాడు. గొప్ప పేరు ఉన్నంత మాత్రాన ఆడలేరన్నాడు. గొప్ప మ్యాచ్‌ విన్నర్‌ అనిల్‌ కుంబ్లే కూడా ఎన్నోసార్లు టీమ్‌ నుంచి బయటకు వెళ్లిన సందర్భాలున్నాయని ప్రసాద్ గుర్తు చేశాడు. జట్టుకు గొప్ప మేలు జరిగే దిశగా మన చర్యలు ఉండాలని వెంకటేశ్‌ ప్రసాద్‌ ట్వీట్‌ చేశాడు. అటు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సైతం కోహ్లీ ఫామ్‌పై స్పందించాడు.

తాను సెలక్టర్‌నైతే కోహ్లీని వచ్చే ప్రపంచకప్‌కు ఎంపిక చేయనని స్పష్టం చేశాడు. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం విరాట్‌పై ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉంది. రెండు, మూడు సిరీస్‌లతో కోహ్లీ లాంటి ఆటగాడిని పక్కన పెట్టలేమంటూ కెప్టెన్ రోహిత్‌శర్మ వ్యాఖ్యానించాడు. జట్టులో ఎలాంటి పరిస్థితి ఉందో… ఎవరు కీలక ఆటగాళ్లో బయట కూర్చున్న వారికి ఏం తెలుసంటూ పరోక్షంగా కపిల్ వ్యాఖ్యలపై హిట్‌మ్యాన్ ఘాటుగా స్పందించాడు. ఇదిలా ఉంటే విండీస్‌తో జరిగే టీ ట్వంటీ సిరీస్‌కూ కోహ్లీ దూరమయ్యే అవకాశముంది. ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కావాలని కోహ్లీ కోరగా.. సెలక్టర్లు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.