Site icon HashtagU Telugu

WTC Final: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌.. ఈరోజు మ్యాచ్‌ను ముగిస్తారా?

South Africa

South Africa

WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్‌ (WTC Final) రెండవ రోజు కూడా ఫాస్ట్ బౌలర్లు త‌మ అధిప‌త్యం కొన‌సాగించారు. 43/4 స్కోర్ నుంచి బ్యాటింగ్ ఆరంభించిన సౌతాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ విధ్వంసకర ప్రదర్శనతో ఆరు వికెట్లు సాధించాడు. WTC ఫైనల్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా కమిన్స్ రికార్డు సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్ ఆధారంగా ఆస్ట్రేలియా 74 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ల ముందు కంగారూ బ్యాటర్లు పూర్తిగా లొంగిపోయారు. రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. జట్టు మొత్తం ఆధిక్యం 218 పరుగులకు చేరుకుంది.

నిరాశ‌ప‌ర్చిన ఆసీస్ బ్యాట‌ర్లు

సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకు కట్టడి చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కంగారూ బ్యాటర్లు పరుగుల కోసం క‌ష్ట‌ప‌డ‌టం కనిపించింది. ఉస్మాన్ ఖవాజా మరోసారి తన ప్రదర్శనతో నిరాశపరిచాడు. కేవలం 6 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. కామెరూన్ గ్రీన్‌ను కగిసో రబడా ఖాతా తెరవకుండానే ఔట్ చేశాడు. మార్నస్ లబుషేన్ కొన్ని మంచి షాట్లు ఆడాడు. కానీ 22 పరుగులు చేసిన తర్వాత మార్కో జాన్సన్‌కు వికెట్‌నిచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం సాధించిన స్టీవ్ స్మిత్ కేవలం 13 పరుగులకే ఔటయ్యాడు.

ట్రావిస్ హెడ్‌ను వియాన్ ముల్డర్ అద్భుతమైన బంతితో క్లీన్ బోల్డ్ చేశాడు. వెబ్‌స్టర్, కెప్టెన్‌ పాట్ కమిన్స్‌లు కూడా బ్యాట్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆలెక్స్ కేరీ కష్ట సమయంలో అద్భుతంగా బ్యాటింగ్ చేసి 43 పరుగుల‌తో సత్తాచాటాడు. కానీ రోజు ఆట ముగిసే ముందు రబడా అతన్ని ఔట్ చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి నాథన్ లియోన్ 1, మిచెల్ స్టార్క్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. రబడా, ఎన్‌గిడి మూడేసి వికెట్లు తీశారు.

Also Read: Roshni Songare: ఎయిర్ హోస్టెస్ కావాలని క‌ల‌.. చివ‌ర‌కు విమాన ప్ర‌మాదంలోనే మృతి!

కమిన్స్ విధ్వంసం

రెండవ రోజు ప్రారంభం సౌతాఫ్రికాకు బాగానే ఉంది. ప్రోటియాస్ జట్టు ఇన్నింగ్స్ కొంత స్థిరంగా కనిపిస్తుండగా.. పాట్ కమిన్స్ తన స్పెల్‌తో సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్‌ను ధ్వంసం చేశాడు. కంగారూ కెప్టెన్ మొదట బవుమా (36) ఇన్నింగ్స్‌కు తెరదీశాడు. ఆ తర్వాత కైల్ వెర్రైన్‌ను 13 పరుగులకు ఔట్ చేశాడు.

మార్కో జాన్సన్‌ను ఖాతా తెరవకుండానే కమిన్స్ జీరోకి పెవిలియన్‌కు పంపాడు. ఒంటరిగా పోరాడుతున్న డేవిడ్ బెడిన్గ్‌హామ్‌ను కూడా కమిన్స్ తన బౌలింగ్‌తో ఔట్ చేశాడు. రబడాను 1 పరుగుకు ఔట్ చేసిన కమిన్స్, సౌతాఫ్రికా జట్టను కేవలం 138 పరుగులకు ఆలౌట్ చేశాడు. కమిన్స్ 28 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు.