Team India : అటు నంబర్ వన్..ఇటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు... ఇప్పుడు టీమిండియా ముందు ఉన్న సవాల్ ఇదే. ఆసీస్‌పై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిస్తే వరల్డ్

  • Written By:
  • Publish Date - February 8, 2023 / 09:47 AM IST

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు… ఇప్పుడు టీమిండియా ముందు ఉన్న సవాల్ ఇదే. ఆసీస్‌పై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకోవడమే కాదు.. సంప్రదాయ క్రికెట్‌లోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుటుంది. తద్వారా మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్‌గా నిలిచిన జట్టుగా రికార్డులకెక్కుతుంది. ప్రపంచ క్రికెట్‌లో మరోసారి అరుదైన అవకాశం టీమిండియాను ఊరిస్తోంది. మూడు ఫార్మేట్లలో అగ్రస్థానం సొంతం చేసుకునే అరుదైన ఫీట్‌కు అడుగు దూరంలో నిలిచింది. కొత్త ఏడాదిలో వరుసగా నాలుగు సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత్ ఇప్పటికే ఐసీసీ టీట్వంటీ ర్యాంకింగ్స్‌లోనూ, వన్డే ర్యాంకింగ్స్‌లోనూ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. తాజాగా టెస్ట్ క్రికెట్‌లోనూ నెంబర్ వన్‌గా నిలిచే ఛాన్స్ వచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిస్తే సంప్రదాయ ఫార్మాట్‌లోనూ మన జట్టు టాప్ ప్లేస్‌కు చేరుకుంటుంది. తద్వారా మూడు ఫార్మాట్లలోనూ నెంబర్ వన్‌గా నిలుస్తుంది. అయితే ఈ సిరీస్‌ను భారత్ కనీసం 2-0తో గెలిస్తేనే టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం చేజిక్కించుకుంటుంది. కంగారూలు ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్‌కు టాప్ ప్లేస్‌ అందదు.

ఇదిలా ఉంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు దక్కించుకునేందుకు ఆసీస్‌తో సిరీసే భారత్‌కు కీలకం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ చేరే రేసులో ఆస్ట్రేలియా, భారత్‌ జట్లు ముందంజలో ఉన్నాయి. ప్రస్తుతం WTC పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 75.56 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. 58.93 శాతంతో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 14 టెస్టులు ఆడగా, మరో 5 ఆడాల్సి ఉంది. ఆ జట్టు దాదాపుగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినట్టే. అటు భారత్ 14 టెస్టులు ఆడగా.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను 3-0తో గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్ బెర్త్ దక్కింటుకుంటుంది. ఒకవేళ ఈ సిరీస్ 2-2తో సమం అయితే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్యే జరగనుంది. అటు శ్రీలంక, సౌతాఫ్రికా జట్లకు కూడా అవకాశం ఉన్నప్పటకీ భారత్, ఆసీస్ సిరీస్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది.

గత ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరినా న్యూజిలాండ్ చేతిలో ఓడింది టీమిండియా. దీంతో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్ల్యూటీసీ టైటిల్ అందుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ టార్గెట్‌ అందుకోవాలంటే ముందు సొంతగడ్డపై ఆసీస్‌ను చిత్తు చేయాల్సిందే.