Wriddhiman Saha : రీఎంట్రీపై ఆశలు వదులుకున్న సాహా

భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అంతర్జాతీయ కెరీర్‌ ముగిసినట్టే కనిపిస్తోంది. అధికారికంగా సాహా రిటైర్మెంట్ ప్రకటించకున్నా..

  • Written By:
  • Publish Date - June 21, 2022 / 05:15 PM IST

భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అంతర్జాతీయ కెరీర్‌ ముగిసినట్టే కనిపిస్తోంది. అధికారికంగా సాహా రిటైర్మెంట్ ప్రకటించకున్నా.. జట్టులోకి ఎంపిక చేసే పరిస్థితి లేదని ఇప్పటికే సెలక్టర్లు అతనికి స్పష్టం చేశారు. తాజాగా సాహా కూడా టీమిండియా ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ తనను ఎంపిక చేయాలనుకుంటే ఇంగ్లాండ్‌ టూర్‌కు వెళ్ళేవాడినంటూ వ్యాఖ్యానించాడు. నిజానికి కొన్నాళ్ల కిందటి వరకూ టెస్టుల్లో టీమిండియా నంబర్‌ వన్‌ ఛాయిస్‌ వికెట్‌ కీపర్‌గా సాహా పేరే మొదటి ప్రాధాన్యతగా ఉంది. అంతకుముందు ధోనీ హాయంలో వెనుకబడిన సాహా తర్వాత టెస్టుల్లో నిలకడగా చోటు దక్కించుకున్నాడు. ధోనీ రిటైర్మెంట్ తర్వాత సెలక్టర్లు సాహాను రెగ్యులర్‌గా ఎంపిక చేసేవారు. మధ్యలో గాయాలతో ఇబ్బందిపడినప్పటికీ.. పంత్ వచ్చిన తర్వాత క్రమంగా జట్టులో చోట కోల్పోయాడు. తన పేరును పరిశీలించలేమంటూ టీమ్‌ కోచ్‌ ద్రావిడ్ కూడా నేరుగా సాహాకి చెప్పేశాడు. అయితే ఐపీఎల్ 15వ సీజన్‌లో రాణించడంతో మళ్ళీ చోటు దక్కుతుందేమోనని పలువురు భావించారు. ఐపీఎల్‌లో ఫినిషర్‌ రోల్‌లో అద్భుతంగా రాణించిన దినేష్‌ కార్తీక్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే సమయంలో టైటిల్‌ గెలిచిన గుజరాత్‌ టైటన్స్‌ టీమ్‌ ఓపెనర్‌గా కీలకపాత్ర పోషించిన సాహాకు మాత్రం నిరాశే ఎదురైంది. సాహా గుజరాత్ తరఫున 3 హాఫ్‌ సెంచరీలతో సహా 317 పరుగులు చేశాడు. అయినప్పటకీ సెలక్టర్లు మాత్రం సాహాను పరిగణలోకి తీసుకోలేదు. ఇక టీమిండియాలో తన రీఎంట్రీ కష్టమేనని సాహా కూడా డిసైడయ్యాడు. తాజాగా అతను చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.

తనకు ఇండియన్‌ టీమ్‌ నుంచి పిలుపు రాలేదంటే ఇక అంతర్జాతీయ కెరీర్‌ ముగిసినట్టేనన్న రీతిలో మాట్లాడాడు. భవిష్యత్తులో తనను సెలక్ట్‌ చేయరని అనుకుంటున్నానని చెప్పాడు. ఇప్పటికే కోచ్‌, చీఫ్‌ సెలక్టర్ కూడా ఆ విషయం తనకు చెప్పేశారని , ఐపీఎల్‌ ప్రదర్శన తర్వాత వాళ్లు తనను తీసుకోవాలని అనుకుంటే ఇంగ్లండ్‌ టూర్‌కు తీసుకునేవాళ్ళంటూ వ్యాఖ్యానించాడు. ఇక తనకు పెద్దగా ఆప్షన్లు లేవనీ, తన వరకూ క్రికెట్‌ ఆడటంపైనే దృష్టి సారిస్తాననీ చెప్పాడు. తాను ఈ గేమ్‌ను ప్రేమించినంత కాలం ఆడుతూనే ఉంటాననిని సాహా స్పష్టం చేశాడు. ఇక ఐపీఎల్ 15వ సీజన్ ప్రదర్శన ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పాడు. ర్యాంకింగ్‌ పరంగా చూస్తే ఇదే తన బెస్ట్‌ సీజన్‌గా అభివర్ణించాడు. ఇదిలా ఉంటే బెంగాల్ రంజీ టీమ్‌ నుంచి కూడా సాహా ఇటీవలే తప్పుకున్నాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సాహా 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 29.41 సగటుతో 1353 పరుగులు, వన్డేల్లో కేవలం 41 పరుగులే చేశాడు. టెస్టుల్లో మూడు శతకాలు సాధించిన సాహాకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డుంది. ఇక 144 ఐపీఎల్‌ మ్యాచ్‌లలో 2427 పరుగులు చేసిన సాహా ఇకపై దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కే పరిమితం కానున్నాడు.