Wriddhiman Saha: ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి వైదొలిగిన వృద్ధిమాన్ సాహా.. ఎందుకంటే?

భారత జట్టు ఆటగాడు, గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టీమ్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇటీవల ఒక సంచలన నిర్ణయం తీసుకు న్నారట !!

  • Written By:
  • Updated On - May 27, 2022 / 07:14 PM IST

భారత జట్టు ఆటగాడు, గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టీమ్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇటీవల ఒక సంచలన నిర్ణయం తీసుకు న్నారట !! బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్ నుంచి వైదొలిగారట!! రంజీ ట్రోఫీలో బెంగాల్ టీమ్ తరఫున ఆడేందుకు ఇష్టం లేకే సాహా ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

ఈమేరకు వివరాలతో ప్రముఖ ఆంగ్ల వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈవిషయంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అవిషేక్ దాల్మియా నేరుగా సాహాకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారని పేర్కొంది. అయినా బెంగాల్ తరఫున రంజీలో ఆడేందుకు సాహా ససేమిరా అన్నాడని కథనంలో తెలిపింది. ఒకవేళ ఇదే విధమైన మంకు పట్టుతో సాహా వ్యవహరిస్తే “నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్”ను చేతిలో పెట్టి సాగనంపేందుకూ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సిద్ధంగా ఉందని ప్రస్తావించింది.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి భారత క్రికెట్ జట్టు ఎంపిక కమిటీ టెస్టు మ్యాచ్ లకు సాహాను దూరంగా పెడుతోంది. రిటైర్మెంట్ దిశగా నిర్ణయం తీసుకోవాలని సాహాకు ఇండియా టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచన సైతం చేశారు. ఈ తరుణంలో కనీసం రంజీ మ్యాచ్ లైనా సాహా ఆడతాడని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ భావించింది. అతడిని ఇటీవల చాలా సార్లు సంప్రదించగా.. ఒళ్ళు నొప్పులు, కాలు నొప్పి వంటి సాకులతో మ్యాచ్ లు ఆడలేనని బదులిచ్చాడు. జూన్ 6న జార్ఖండ్ తో జరగనున్న రంజీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కు బెంగాల్ టీమ్ ఎంపిక చేసిన స్క్వాడ్ లోనూ సాహా పేరు లేదు.