Gujarat Thrash Chennai: గుజరాత్ టైటాన్స్… తగ్గేదే లే

ఐపీఎల్ 15వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది.

  • Written By:
  • Publish Date - May 15, 2022 / 07:24 PM IST

ఐపీఎల్ 15వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ కి అర్హత సాధించిన ఆ జట్టు తగ్గేదే లే అంటూ మరో విజయాన్ని అందుకుంది. అన్ని విభాగాల్లో అదరగొట్టిన గుజరాత్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తు చేసింది.

టోర్నీ ఆరంభం నుంచీ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్ తీరు ఈ మ్యాచ్ లోనూ మారలేదు. ఐపీఎల్‌ టేబుల్‌ టాపర్స్ గుజరాత్‌ టైటన్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్ త్వరగానే ఓపెనర్ కాన్వే వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మొయిన్‌ అలీతో కలిసి మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు . ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి ఊపు మీద కనిపించిన మొయిన్‌ అలీ కూడా ఔటయ్యాక చెన్నై ఇన్నింగ్స్ స్లోగా సాగింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ ఒక్కడే హాఫ్‌ సెంచరీతో రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 133 రన్స్‌ మాత్రమే చేసింది. చివర్లో మెరుపులు మెరిపిస్తాడనుకున్న ధోనీ 10 బంతుల్లో కేవలం 7 రన్స్ చేసి ఔటయ్యాడు. నారాయణ్ జగదీశన్ 33 బంతుల్లో 39 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. గుజరాత్ స్టార్ బౌలర్ మహ్మద్ షమి 4 ఓవర్లలో కేవలం 19 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

135 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ ధాటిగా ఆడింది. ఓపెనర్లు గిల్ , సాహా తొలి వికెట్ కు 59 పరుగులు జోడించారు. గిల్ ఔటయ్యాక సాహా , వేడ్ ఇన్నింగ్స్ కొనసాగించారు. ఈ సీజన్ లో నిలకడగా రాణిస్తున్న సాహా తన ఫామ్ కొనసాగించాడు. హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. వేడ్ , హార్థిక్ పాండ్య వికెట్లు కోల్పోయినా…డేవిడ్ మిల్లర్ తో కలిసి సాహా జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. సాహా జోరుతో గుజరాత్ 19.1 ఓవర్లలో టార్గెట్ చేదించింది. సాహా బంతుల్లో 8 ఫోర్లు , 1 సిక్సర్ తో 67 , మిల్లర్ 15 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ విజయంతో లీగ్ స్టేజ్ ను గుజరాత్ టాప్ ప్లేస్ లో ముగించడం దాదాపుగా ఖాయమైంది.