Site icon HashtagU Telugu

WPL Final: తొలి టైటిల్ చిక్కేదెవరికి? ఢిల్లీ, ముంబై మధ్య ఫైనల్ ఫైట్

WPL 2024

Wpl Final.. Mumbai Indians Take On Delhi Capitals For Inaugural title

WPL Final : మహిళల ఐపీఎల్ (WPL) తొలి సీజన్ ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య టైటిల్ పోరు జరగబోతోంది. ముంబై బ్రబౌర్న్ స్టేడియం ఈ మెగా ఫైట్ కు వేదిక కానుంది. బలాబలాల పరంగా రెండు జట్లూ సమఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్ చేరుకుంటే.. వరుస విజయాలతో అదరగొట్టి తర్వాత తడబడిన ముంబై ఎలిమినేటర్ లో యూపీ వారియర్స్ ను చిత్తు చేసి తుదిపోరుకు దూసుకొచ్చింది. ఈ సీజన్ లో ఇరు జట్లూ తలపడనుండడం ఇది మూడోసారి. ఫామ్, బలాబలాల పరంగా ఏ జట్టును తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి.

సీజన్ ఆరంభం నుంచే రెండు జట్లూ కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. లీగ్ స్టేజ్ ను ఇరు జట్లూ 12 పాయింట్ల ముగించాయి. రెండు జట్లూ కూడా ఆరు మ్యాచ్ లలో గెలిచి రెండేసి మ్యాచ్ లలో పరాజయం పాలయ్యాయి. అయితే ముంబైతో పోలిస్తే ఢిల్లీ కాస్త మెరుగ్గా రాణించి నేరుగా ఫైనల్ కు దూసుకెళ్ళింది. ఢిల్లీ క్యాపిటల్స్ కు మెగ్ లానింగ్ కెప్టెన్సీ ప్రధాన బలం. ప్లేయర్ గానూ సూపర్ ఫామ్ లో ఉన్న లానింగ్ జట్టును సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తోంది. ఆ జట్టులో షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్ రాధా యాదవ్ లాంటి భారత ప్లేయర్స్ తో పాటు క్యాప్సీ, మరిజానే కప్ లాంటి విదేశీ క్రికెటర్లు కూడా కీలకం కానున్నారు.

మరోవైపు ముంబై ఇండియన్స్ ఆరంభంలో వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచి అదరగొట్టింది. ఆ తర్వాత వరుస ఓటములతో కాస్త తడబడినప్పటకీ కీలక సమయంలో మళ్ళీ పుంజుకుంది. ముఖ్యంగా ఎలిమినేటర్ లో యూపీ వారియర్స్ ను చిత్తు చేసింది. సీవర్ మెరుపు ఇన్నింగ్స్ , వాంగ్ హ్యాట్రిక్ కలిసి ముంబైని ఫైనల్ కు చేర్చాయి. తుది పోరులోనూ ఇదే జోరు కొనసాగించేందుకు ముంబై ఎదురుచూస్తోంది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నిలకడగా రాణించలేకపోవడం ఇబ్బందిగా మారింది.

టైటిల్ ఫైట్ లో ఆమె కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడితే ముంబైకి తిరుగుండదు. కాగా ఇరు జట్లూ తమ విన్నింగ్ కాంబినేషన్ ను మార్చే అవకాశాలు లేనట్టే. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ముంబై బ్రబౌర్న్ స్టేడియం బ్యాటింగ్, బౌలింగ్ కు సమానంగా అనుకూలిస్తోంది. ఇప్పటి వరకూ ఇక్కడ 10 మ్యాచ్ లు జరిగితే ఆరుసార్లు ఛేజింగ్ టీమ్స్ గెలిచాయి. ఈ పిచ్ పై యావరేజ్ స్కోర్ 180 రన్స్ నమోదైంది. కాగా ఇరు జట్లలోనూ స్వదేశీ, విదేశీ స్టార్ ప్లేయర్స్ ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.

Also Read:  Orange Army: సన్ రైజ్ అయ్యేనా.. ఆరెంజ్ ఆర్మీ పై అంచనాలు