Site icon HashtagU Telugu

WPL 2024 Final: బెంగళూరుదే డబ్ల్యూపీఎల్ టైటిల్, ఫైనల్లో చతికిలపడిన ఢిల్లీ క్యాపిటల్స్‌

WPL 2024 Final

WPL 2024 Final

WPL 2024 Final: ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కల తీరింది. పురుషుల ఐపీఎల్‌లో సుధీర్ఘ కాలంగా నిరీక్షణ కొనసాగుతుండగా… మహిళల ఐపీఎల్‌లో కప్ గెలిచింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి తొలిసాగి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో కేవలం పవర్‌ ప్లేలో మాత్రమే ఢిల్లీ ఆధిపత్యం కనబరిచింది. ఆ తర్వాత మ్యాచ్‌ అంతా ఆర్‌సీబీదే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు మెగా లానింగ్ , షెఫాలీ వర్మ తిరుగులేని ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు పవన్ ప్లేలో 61 పరుగులు జోడించాడు. అయితే ఆర్‌సీబీ స్పిన్నర్ సోఫీ మోలినక్స్‌ ఢిల్లీని దెబ్బకొట్టింది. ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టు జోరుకు బ్రేక్ వేసింది. ఫలితంగా ఒత్తిడికి లోనైన ఢిల్లీ తర్వాత ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది. పవర్ ప్లే తర్వాత ఒకేసారి 3 వికెట్లు కోల్పోవడం, తర్వాత వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టే పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో భారీస్కోరు చేస్తుందనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పటేల్ 4 , సోఫీ మోలినక్స్ 3 , ఆశా శోభన 2 వికెట్లు తీశారు.

ఛేజింగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలకడగా ఆడింది.భారీ లక్ష్యం కాకపోవడంతో ఆ జట్టు ఓపెనర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడారు. తొలి వికెట్‌కు స్మృతి మంధాన, సోఫీ డివైన్ 49 పరుగులు జోడించారు. సోఫీ 32 , మంధాన 31 పరుగులకు ఔటవగా… తర్వాత ఎల్లిస్ పెర్రీ, వికెట్ కీపర్ రిఛా ఘోష్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 32 పరుగులు జోడించారు. అయితే మ్యాచ్ చివరి వరకూ కొనసాగినప్పటకీ… వికెట్లు చేతిలో ఉండడంతో టార్గెట్‌ను ఛేదించేందుకు బెంగళూరు టెన్షన్ పడలేదు. ఆ జట్టు 19.3 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకుంది.

Also Read: WPL 2024: టైటిల్ గెలుపు దిశగా ఆర్సీబీ