Site icon HashtagU Telugu

IND vs PAK: అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య నేడు ఫైన‌ల్ మ్యాచ్‌..!

IND vs PAK

IND vs PAK

IND vs PAK: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024లో శుక్రవారం రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఛాంపియన్స్ వెస్టిండీస్ ఛాంపియన్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీని తర్వాత రెండో సెమీఫైనల్‌లో ఇండియా ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌పై భారత్ ఛాంపియన్స్ విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు ఫైనల్‌లో భారత్‌-పాక్‌ల (IND vs PAK) మధ్య ఉత్కంఠభరితమైన పోటీని చూడబోతున్నారు అభిమానులు.

ఆస్ట్రేలియాపై భారత్ 86 పరుగుల తేడాతో విజయం

సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. భారత చాంపియన్స్ బ్యాటింగ్‌లో రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శించారు. ఉతప్ప 65 పరుగులు, యువరాజ్ 59 పరుగులు, యూసుఫ్ 51 పరుగులు, ఇర్ఫాన్ 50 పరుగులు చేశారు. అనంతరం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది, ఈ మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read: James Anderson: కొత్త పాత్ర‌లో అండ‌ర్స‌న్.. ఫాస్ట్ బౌలింగ్ మెంటార్‌గా..?

బర్మింగ్‌హామ్‌లో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ కేవలం 28 బంతుల్లో ఐదు సిక్సర్ల సాయంతో 59 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో యువీ బ్యాట్ నుంచి నాలుగు అద్భుతమైన ఫోర్లు కూడా వచ్చాయి. యువరాజ్ ఈ ఇన్నింగ్స్ చూసిన అభిమానులు 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై 30 బంతుల్లో 70 పరుగులు చేసిన ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

భారత్‌-పాక్‌ల మధ్య ఫైన‌ల్ మ్యాచ్‌

ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ఫైనల్‌లో ఇండియా ఛాంపియన్స్- పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లో శనివారం జూలై 13న భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు జరుగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్ ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఛాంపియన్స్ విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సువర్ణావకాశం ఇప్పుడు భారత ఛాంపియన్స్‌కు దక్కింది.