World Boxing Championship: నిఖత్ గోల్డెన్ పంచ్

హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో రెండోసారి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. తద్వారా వరుసగా రెండుసార్లు స్వర్ణం గెలిచిన బాక్సర్ గా రికార్డులెక్కింది.

  • Written By:
  • Publish Date - March 26, 2023 / 07:36 PM IST

World Boxing Championship: హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో రెండోసారి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. తద్వారా వరుసగా రెండుసార్లు స్వర్ణం గెలిచిన బాక్సర్ గా రికార్డులెక్కింది. అలాగే మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన బాక్సర్ గా ఘనత సాధించింది. ఊహించినట్టుగానే తుది పోరులో నిఖత అదరగొట్టేసింది. టైటిల్ పోరులో రెండు సార్లు అసియా ఛాంపియన్‌షిప్‌ గెలుచుకున్న వియత్నాం బాక్సర్ గుయెన్‌ టాన్‌పై 5-0తో విజయం సాధించింది. తొలి రౌండ్ నుంచే పూర్తి ఎటాకింగ్ తో చెలరేగిపోయింది. ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా ఆధిపత్యం కనబరిచింది. చివరి రౌండ్ వరకూ నిఖత్ దూకుడుగా ఆడడం ద్వారా ప్రత్యర్థిని డామినేట్ చేసింది. గతేడాది 52 కేజీల విభాగంలో పసిడి దక్కించుకున్న నిఖత్‌.. ఈసారి 50 కేజీల విభాగంలో స్వర్ణాన్ని సొంతం చేసుసుకొని చరిత్ర సృష్టించింది. గతంలో మేరీకోమ్ ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. మేరీకోమ్ 2002,2005,2006,2008,2010,2018లలో స్వర్ణాలు గెలుచుకుంది. నిఖత్ జరీన్ గత ఏడాదితో పాటు ఇప్పుడు సొంతగడ్డపై జరిగిన టోర్నీలోనూ అదరగొట్టి రెండోసారి స్వర్ణం కొల్లగొట్టింది.

తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ జూనియర్ స్థాయి నుంచే జాతీయ బాక్సింగ్ పోటీల్లో పలు రికార్డులు సృష్టించింది. టర్కీలో జరిగిన 2011 ప్రపంచ జూనియర్‌, యూత్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన ఈ యువ బాక్సర్ 2014 నేషన్స్‌ కప్‌లో స్వర్ణం , 2015 జాతీయ సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు గెలుచుకుంది. అలాగే 2016 దక్షిణాసియా ఫెడరేషన్‌ క్రీడల్లో కాంస్యం, 2018 సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన టోర్నీలో స్వర్ణం
2019 థాయ్‌లాండ్‌ ఓపెన్లో రజతం సాధించింది. ఇక 2019, 2022లలోస్ట్రాంజా మెమోరియల్‌లో పసిడి పతకం గెలిచింది. అటు గత ఏడాది కాలంగా అంతర్జాతీయ పోటీల్లో వరుస విజయాలతో అదరగొడుతోంది. గత ఏడాది మే నెలలో ఇస్తాంబుల్‌ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడంతో పాటు కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించింది. తాజాగా మరోసారి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ గోల్డెన్ పంచ్ విసిరింది.