ఆసియా కప్ అలా ముగిసిందో లేదో క్రికెట్ లవర్స్ కోసం మరో బిగ్ ఈవెంట్ ప్రారంభమైంది. ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫీవర్ ఇవాల్టి నుంచి మొదలవ్వనుంది. భారత్ వేదికగా సాగే ఈ ప్రపంచకప్‌కు అన్ని దేశాలు సిద్ధమయ్యాయి. నెల రోజులకు పైగా జరగనున్న ఈ మెగా టోర్నీకి దేశంలోని ప్రముఖ స్టేడియాలు ముస్తాబయ్యాయి. ఈ వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో భారత్ – శ్రీలంక తలపడనున్నాయి.
ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025లో హోం టీమ్ టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా మరోసారి టైటిల్ అందుకోవాలని ఉర్రూతలూగుతుండగా.. ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని సౌతాఫ్రికా ఎదురుచూస్తోంది. ఈ మెగా ఈవెంట్ కోసం దేశంలోని నాలుగు స్టేడియాలు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవగా.. అందులో విశాఖపట్టణం కూడా ఒకటి కావడం విశేషం.
పహల్గాం ఉగ్రదాడికి ముందు నుంచే భారత్ – పాక్ మధ్య పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారిపోవడంతో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లకు మాత్రం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ మ్యాచ్‌లు మినహా మిగతావన్నీ భారతదేశంలోనే జరగనున్నాయి. పాకిస్తాన్ మ్యాచ్‌లు మాత్రం శ్రీలంకలోని కొలంబో వేదికగా సాగుతాయి.
తొలి మ్యాచ్
ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్ భారత్ – శ్రీలంక మధ్య జరగనుంది. అసోంలోని గువాహటి వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. వన్డే వరల్డ్ కప్ కావడంతో మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ లైవ్‌ను జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.
భారత్, శ్రీలంక జట్లు వన్డేల్లో ఇప్పటి వరకు 35 మ్యాచ్‌లలో తలపడ్డాయి. అందులో టీమిండియాదే పైచేయి. భారత్ 31 మ్యాచ్‌లలో విజయం సాధిస్తే, శ్రీలంక కేవలం మూడింటిలోనే గెలిచింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఈ రెండు జట్లు చివరగా మే 11న ఆడగా అందులోనూ భారత జట్టే గెలిచింది.
టీమిండియా జట్టు అంచనా
ప్రతికా రావెల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహా రానా, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.
శ్రీలంక జట్టు అంచనా
హాసిని పెరేరా, చమారీ ఆటపట్టు (కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, కవిషా దిల్హారి, అనుష్క సంజీవని (వికెట్ కీపర్), దివ్మీ విహంగ, ప్యూమీ వాత్సల, అచిని కులసూర్య, ఉదేశిక ప్రబోధని, మల్కీ మదర