Delhi Capitals: మహిళల ప్రీమియర్ లీగ్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్

మహిళల ప్రీమియర్ లీగ్ 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు ఫైనల్‌కు చేరుకుంది.

  • Written By:
  • Publish Date - March 22, 2023 / 09:20 AM IST

మహిళల ప్రీమియర్ లీగ్ 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ జట్టు రెండో స్థానంలో, యూపీ వారియర్స్ మూడో స్థానంలో నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ ఆడుతుంది.

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. యూపీ వారియర్స్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. యూపీ వారియర్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 138 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ 17.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగుల చేసి విజయం సాధించింది.

Also Read: World Cup 2023: వన్డే ప్రపంచ కప్‌ 2023 షెడ్యూల్ ఖరారు.. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం..!

139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి శుభారంభం లభించింది. కెప్టెన్ మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ తొలి వికెట్‌కు 4.5 ఓవర్లలో 56 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. 16 బంతుల్లో 21 పరుగులు చేసి షెఫాలీ ఔటైంది. జెమీమా రోడ్రిగ్స్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ లానింగ్ 23 బంతుల్లో 39 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకుంది. 70 పరుగులకే మూడు వికెట్లు పడిపోయిన తర్వాత మారిజాన్ క్యాప్, అలిస్ క్యాప్సే ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 31 బంతుల్లో 34 పరుగులు చేసి క్యాప్సే ఔట్ అయింది. జెస్ జోనాసెన్ ఖాతా తెరవలేకపోయింది. మరిజన్ క్యాప్ 34 పరుగులు చేసి, అరుంధతి రెడ్డి ఖాతా తెరవకుండానే నాటౌట్ గా నిలిచింది.

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. మార్చి 26న బ్రబౌర్న్ స్టేడియంలో టైటిల్ మ్యాచ్‌లో ఢిల్లీ తలపడనుంది. మార్చి 24న జరిగే ఎలిమినేటర్‌ ద్వారా ఫైనల్‌లోని ఇతర జట్టును నిర్ణయిస్తారు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో ఉన్న యూపీ వారియర్స్‌తో తలపడనుంది.