Site icon HashtagU Telugu

Women Premier League Auction: ఒకటోసారి.. రెండోసారి.. మహిళల ఐపీఎల్ వేలానికి అంతా రెడీ..!

Bcci Plans Six Team Womens Ipl Next Year

Bcci Plans Six Team Womens Ipl Next Year

పురుషుల క్రికెట్ స్థాయిలో కాకున్నా.. మహిళల క్రికెట్ కు గత కొంతకాలంగా ఆదరణ పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా పలు లీగ్స్ లోనూ ఫ్యాన్స్ మ్యాచ్ లను ఆస్వాదిస్తున్నారు. ఇక భారత్ లో మహిళల క్రికెట్ కు ప్రోత్సాహం ఇచ్చే ఉధ్ధేశంతో వుమెన్స్ ఐపీఎల్ ను (Women Premier League) ప్రారంభించింది. ఇప్పటికే ఫ్రాంచైజీల అమ్మకం, బ్రాడ్ కాస్టింగ్ హక్కులు వంటి ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. ఇక మహిళా క్రికెటర్ల వేలం మిగిలి ఉంది. వేలం కోసం 1525 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే 409 మందిని మాత్రమే తుదిజాబితాలో చేర్చినట్టు బీసీసీఐ ప్రకటించింది. దీనికి సంబంధించిన వేలం సోమవారం జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు వేలం మొదలు కానుంది.

వేలం కోసం రిజిస్టర్ చేసుకున్న వారిలో 264 మంది భారత క్రీడాకారిణులు ఉండగా, 163 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఐసీసీ అసోసియేట్‌ దేశాల నుంచి 8 మందికి చోటు దక్కింది. ఒక్కో జట్టులో 18 మంది చొప్పున ఐదు ఫ్రాంచైజీల్లో కలిపి 90 ఖాళీలు ఉన్నాయి. రూ. 10, 20, 30, 40, 50 లక్షల ప్రారంభ ధరల విభాగాల్లో క్రికెటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఒక్కో జట్టుకూ రూ. 12 కోట్ల మనీ పర్సు ఉంటుంది. వేలంలో ప్రతి జట్టు కూడా రూ. 12 కోట్లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రతి జట్టు కూడా వేలంలో 15 మందికి తగ్గకుండా 18 మందికి మించకుండా ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Also Read: Team India: ఘనంగా టైటిల్ వేట షురూ… పాక్‌పై భారత మహిళల గ్రాండ్ విక్టరీ

ఇందు కోసం రూ. 12 కోట్ల వరకు ఖర్చు చేయొచ్చు. క్యాప్డ్ ప్లేయర్స్ ను మూడు కేటగిరీలుగా విభజించారు. రూ. 50 లక్షలు, రూ. 40 లక్షలు, రూ. 30 లక్షలుగా కనీస ధరను నిర్ణయించారు. ఇక అన్ క్యాప్డ్ జాబితాను రెండు బేస్ ప్రైజ్ లు గా విభజించారు. ఐదుగురు విదేశీ ప్లేయర్స్ తుది జట్టులో ఆడించాలి. అయితే అందులో ఒకరు తప్పనిసరిగా అసోసియేట్ కంట్రీ ప్లేయర్ అయి ఉండాలి. ఇదిలా ఉంటే పేర్లు నమోదు చేసుకున్న వారిలో తెలంగాణ, ఆంధ్రకు చెందిన పలువురు క్రికెటర్లు కూడా వేలంలోకి రానున్నారు.

ఇప్పటికే భారత మహిళల సీనియర్ జట్టుకు ఆడిన ఏపీ క్రీడాకారిణులు స్నేహ దీప్తి, అంజలి శర్వాణి, సబ్బినేని మేఘనతో పాటు హైదరాబాద్ క్రికెటర్ అరుంధతి రెడ్డి రూ. 30 లక్షల కేటగిరీలో వేలంలోకి వస్తారు. అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఆడిన గొంగడి త్రిష, యశశ్రీతో పాటు హైదరాబాద్ నుంచి మదివాడ మమత, ప్రణవి, ఇషిత రూ. 10 లక్షల ప్రారంభ ధరలో నిలిచారు. అండర్ 19 ప్రపంచ కప్ జట్టు సభ్యురాలైన ఏపీ క్రికెటర్ షబ్నిమ్ కూడా ఇదే కేటగిరీలో వేలంలోకి రానుంది.