India Strong:ఛేజింగ్ అంత ఈజీ కాదు

బర్మింగ్‌హామ్ వేదికగా భారత్,ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ సిరీస్ ఫలితాన్ని తేల్చనుంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ గెలిచినా, డ్రా చేసుకున్నా సిరీస్ కైవసం చేసుకుంటుంది.

  • Written By:
  • Publish Date - July 4, 2022 / 12:12 PM IST

బర్మింగ్‌హామ్ వేదికగా భారత్,ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ సిరీస్ ఫలితాన్ని తేల్చనుంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ గెలిచినా, డ్రా చేసుకున్నా సిరీస్ కైవసం చేసుకుంటుంది. మరోవైపు ఫాలో ఆన్ గండం తప్పించుకున్నా తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడిన ఇంగ్లాండ్‌ విజయం సాధించాలంటే భారీ లక్ష్యాన్నే ఛేదించాల్సి ఉంటుంది. ఇప్పటికే భారత్ ఆధిక్యం 250 దాటిపోగా… నాలుగోరోజు మరిన్ని పరుగులు చేయడం ఖాయమనే చెప్పొచ్చు. అయితే ఇటీవల ఇంగ్లాండ్ ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని భారత్ 400కు పైగా టార్గెట్‌ను ఇంగ్లాండ్ ముందుంచే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఎడ్జ్‌బాస్టన్‌లో గత రికార్డులు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే.. ఇక్కడ లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదు. ఇప్పటి వరకూ ఇక్కడ జరిగిన 54 టెస్టుల్లో 12 జట్లు మాత్రమే ఛేజింగ్‌లో గెలిచాయి. ఈ 12 జట్లలో కేవలం రెండు సార్లు మాత్రం 200 ప్లస్ టార్గెట్‌ను ఛేజ్ చేయడం జరిగింది. 2008లో ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రికా 281 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడమే ఇప్పటివరకూ హయ్యెస్ట్ ఛేజింగ్‌గా ఉంది. 1999లో న్యూజిలాండ్‌పై 208 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లాండ్ ఛేదించడం రెండోఅత్యధిక ఛేదన. 2015లో ఆస్ట్రేలియాపై, 1996లో భారత్‌పై ఇంగ్లాండ్‌ 121 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది.

కాగా ప్రస్తుత మ్యాచ్‌లో భారత్ విధించే భారీ టార్గెట్ ను ఛేజ్ చేయడం ఇంగ్లాండ్‌కు సవాలే. కివీస్ బౌలర్లపై ఆధిపత్యం కనబరిచి మూడు టెస్టుల్లోనూ లక్ష్యాలను ఛేదించినా భారత బౌలింగ్‌ను ఎదుర్కొని గెలవడం అంత ఈజీ కాదు. ఈ విషయం తొలి ఇన్నింగ్స్‌లోనే ఆ జట్టు బ్యాటర్లకు స్పష్టమైంది. అలాగే ప్రస్తుతం ఇంగ్లాండ్ టీమ్‌లో కేవలం బెయిర్ స్టో మాత్రమే నిలకడగా రాణిస్తున్నాడు. కివీస్‌పై విజయాల్లో బెయిర్ స్టోనే కీలకపాత్ర పోషించాడు. తాజాగా భారత్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని శతకం సాధించడమే కాదు ఫాలో ఆన్ తప్పించాడు. దీంతో భారత్ బెయిర్ స్టోను కట్టడి చేయగలిగితే చారిత్రక సిరీస్ విజయం అందుకున్నట్టే. సిరీస్‌ చేజారకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పిస్తే ఇంగ్లాండ్‌కు మరో ఆప్షన్ లేదు. డ్రాగా ముగిసినా కూడా సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంటుంది. దీంతో ఈ పిచ్‌పై గత రికార్డులు, ప్రస్తుత భారత్ బౌలింగ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే అద్భుతం జరిగితే తప్ప భారత్ సిరీస్ విజయాన్ని ఇంగ్లాండ్ అడ్డుకోవడం అసాధ్యమనే చెప్పాలి.